
– నలుగురిపై కేసు నమోదు
హైదరాబాద్: మద్యం మత్తులో న్యూసెన్స్‌కు పాల్పడుతుండగా డయల్ 100 కాల్‌తో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసుల పైకి కుక్కలను వదిలిన ఓ న్యూస్ రిపోర్టర్‌తో పాటు మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని అరోరా కాలనీలో ఓ ఇంటి టెర్రస్‌పై 20 మందికి పైగా యువకులు అర్ధరాత్రి దాకా మద్యం సేవిస్తూ గాలిలోకి మద్యం బాటిళ్లను విసురుతూ, పగులగొడుతూ గోల చేస్తుండగా చుట్టుపక్కల నివాసితులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్‌కుమార్, నైట్ డ్యూటీ ఎస్‌ఐ సంధ్యారాణి ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూసెన్స్ జరుగుతున్న ఇంటి టెర్రస్ పైకి వెళ్లడానికి యతి్నంచగా వీరి పైకి కుక్కను వదిలి విధులను అడ్డుకున్నారు. దీనిపై బంజారాహిల్స్ కానిస్టేబుల్ భరత్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ న్యూస్ రిపోర్టర్ సహా అజయ్, శివ, రవి తదితరులపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 121 (1), 126 (2), 291, 292, 352, 189 (5) కింద కేసు నమోదు చేశారు.
తాము ఘటనా స్థలానికి వెళ్తున్న క్రమంలో సుమారు 20 మంది వరకు తమను అడ్డుకోవడంతో పాటు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేయగా తన చేతికి గాయమైందని కానిస్టేబుల్ భరత్‌కుమార్ ఆరోపించారు. తాము ఘటనా స్థలం నుంచి మెట్టుదిగే క్రమంలో మరోసారి 10–15 మంది వరకు తమను చుట్టుముట్టి దుర్బాషలాడుతూ యూనిఫాం తీసేసి అవమానిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీరిలో కుమార్ అనే వ్యక్తి తాను న్యూస్ చానల్ రిపోర్టర్‌నంటూ తీవ్రంగా దుర్బాషలాడాడని అజయ్, శివ, రవి సహా మరికొందరు కూడా తోడయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.