గత ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసిన సుభద్రారెడ్డి
వీరిలో అత్యంత పిన్న వయస్కురాలు 32 ఏళ్ల అస్మా బేగం
విద్యా వంతులు, మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం
సెగ్మెంట్‌లో మొత్తం 1.91 లక్షల మంది మహిళా ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలున్నారు. వీరిలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు సోషలిస్ట్ పార్టీ (ఇండియా) నుంచి రచ్చా సుభద్రా రెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇంక్విలాబ్–ఏ–మిల్లత్ (ఏఐఎంఐఎం–ఇంక్విలాబ్) నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై సోషలిస్ట్ పార్టీ (ఇండియా) తరుఫున పోటీ చేసిన సుభద్రారెడ్డి..ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బరిలోకి దిగింది.
బరిలో చిన్న వయస్కురాలు..
నలుగురు మహిళా అభ్యర్థుల్లో అత్యంత పిన్న వయస్కురాలు.. 32 ఏళ్ల అస్మా బేగం కాగా.. 75 ఏళ్ల సుభద్రా రెడ్డి అధిక వయస్కురాలు. బంజారాహిల్స్ నివాసి అయిన సుభద్రా.. చేనేత–జౌళి శాఖ రిటైర్డ్ గెజిటెడ్ అధికారిణి. ఈమె 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేరడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎన్నికల పోరాటంలో ఆమె సుపరిచితురాలే. సుభద్రా రెడ్డి 2009లో లోక్‌సత్తా అభ్యర్థిగా భువనగిరి లోకసభ స్థానం కోసం పోటీ చేశారు. ఆ తర్వాత 2021లో స్వతంత్ర అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. 2023లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయగా సుభద్రకు 721 ఓట్లు పోలయ్యాయి.
స్థిరచరాస్తులు, కేసులు..
షేక్ రఫత్ జహాన్‌కు ఈ ఉప ఎన్నికే రాజకీయ ఆరంగేట్రం. ఆమె భర్త గతంలో చేవెళ్ల లోకసభ నుంచి పోటీ చేశారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థి అస్మా బేగం కూడా చురుగ్గానే ప్రచారం చేస్తున్నారు. సుభద్రకు రూ.52 లక్షలు, షేక్ రఫత్ జహాన్‌కు రూ.10 లక్షలు, సునీతకు రూ.7 కోట్లకు పైగా విలువ చేసే స్థిరచరాస్తులున్నాయి. ఈమె మీద జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు ఉంది. ఇక, అస్మా బేగం మీద పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు గాను ఓయూ ఠాణాలో కేసు ఉంది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 3.99 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1.91 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. దీంతో మహిళా అభ్యర్థులందరూ ‘ఆమె’ కేంద్రంగానే ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. అతివలను తమ వైపు తిప్పుకుంటే ఆయా కుటుంబాల్లోని ఓట్లు సంపూర్ణంగా తమకే పడే అవకాశాలున్నాయని బలంగా నమ్ముతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు హామీలు, తాయిళాలతో ఆమె ఓట్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.


