నూతన చట్టం, విలీనం పేరిట కాలయాపన
బీజేపీ సభ్యుల నియామకంతోనే పాలన సాగిస్తున్న వైనం
ఎన్నికలు జరపాలంటూ స్థానికుల డిమాండ్
సికింద్రాబాద్: కంటోన్మెంట్‌లను మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దుతామని 2020లో చట్టంలో మార్పులు చేస్తూ నూతన చట్టానికి రూపకల్పన చేశారు. రెండేళ్లపాటు పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో చేర్చినప్పటికీ, ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే కంటోన్మెంట్‌లను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తామంటూ కేంద్రం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇంతలోనే రెండేళ్ల క్రితం కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. తీరా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందనే లోపే ఎన్నికల నోటిపికేషన్‌ను ఉపసంహరించుకుంది.
అటు కొత్త చట్టం లేదు.. ఇటు విలీనం లేదు.. నాలుగేళ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రజాస్వామ్యమే లేదు. ఇదేమని అడిగితే ప్రతిసారీ ఏదో ఒక సాకుతో దాటవేయడమే తప్ప ఒక్కడ అడుగు కూడా ముందుకు పడలేదు. కంటోన్మెంట్‌లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కొందరు కోర్టుకెళ్లినా ప్రయోజనం లేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు బోర్డు ఎన్నికలపై తేల్చాలంటూ కేంద్రానికి స్పష్టమైన సూచన చేసింది. ఈ నేపథ్యంలోనైనా కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
నాలుగేళ్లుగా వెరీడ్ బోర్డ్ ఆధ్వర్యంలోనే...
దేశంలోనే అతిపెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తోనే (Secunderabad cantonment board) విలీన ప్రక్రియను మొదలు పెట్టి 2023 జనవరి 4న కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఒక్కసారి మాత్రమే ఈ కమిటీ భేటీ జరగ్గా, ఆ సమావేశం మినిట్స్ ఏంటో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. ఇదిలా ఉండగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగి వచ్చే నెలకు (జనవరి 11, 2015) సరిగ్గా పదకొండేళ్లు పూర్తవుతుంది. ఐదేళ్ల సాధారణ పదవీకాలంతో పాటు ఏడాది పొడిగింపుతో సాధారణ బోర్డు పదవీకాలం పూర్తయి ఐదేళ్లు అవుతోంది. ప్రజా ప్రతినిధులు లేకండానే ఐదేళ్లుగా బోర్డులో అధికారుల పాలనే కొనసాగుతోంది. బోర్డులో ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, ప్రత్యేక పాలన కొనసాగించడంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.
ఎనిమిది మంది అధికారులు ఎనిమిది మంది ప్రజాప్రతినిధులతో కూడిన బోర్డు స్థానంలో నాలుగేళ్లుగా వెరీడ్ బోర్డునే కొనసాగిస్తున్నారు. స్థానిక మిలిటరీ స్టేషన్ కమాండర్ అధ్యక్షుడిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే బోర్డులో కేంద్ర ప్రభుత్వం నియమించే సివిలియన్ నామినేటెడ్ మెంబర్ మరో సభ్యులుగా ఉంటారు. కేంద్రం బీజేపీకి చెందిన సభ్యులను మాత్రమే నామినేటెడ్ సభ్యులుగా నియమిస్తూ వస్తోంది. తొలి మూడేళ్లు రామకృష్ణ నామినేటెడ్ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది జనవరి నుంచి భానుక నర్మదా (Banuka Narmada) నామినేటెడ్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ పదవి కోసం బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి.
నాలుగేళ్లుగా ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ సభ్యులతోనే పాలన సాగించడాన్ని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తక్షణమే కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీలో విలీన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.
2015లో చివరి ఎన్నికలు..
రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్‌లో ది కంటోన్మెంట్స్ యాక్ట్ –1924 పేరిట బ్రిటీష్ జమానాలోనే ప్రత్యేక పాలన మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి అనేక చట్టాలు అమల్లోకి వచ్చినా, కంటోన్మెంట్‌లలో మాత్రం ఎలాంటి మార్పుల్లేవు. దాదాపు 80 ఏళ్ల తర్వాత 2006లో పురాతన చట్టంలో కొద్దిపాటి మార్పులతో నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 1987 వరకు కంటోన్మెంట్ బోర్డుకు మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగ్గా, 1992 నుంచి ఐదేళ్లకోసారి నిర్వహిస్తూ వచ్చారు.
చదవండి: సెలవులు పెట్టి.. చెక్కేస్తున్నారు!
2015 జనవరి 11న చివరిసారిగా కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. 100 ఏళ్లకు పైబడిన పురాతన చట్టాల్లో మార్పులు చేపట్టిన మోడీ సర్కారు, కంటోన్మెంట్ చట్టంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ది కంటోన్మెంట్ బిల్–2020 పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టి, పార్లమెంట్ ఆమోదం కోసం ఎజెండాలో చేర్చారు. రెండేళ్లపాటు ఎజెండాకే పరిమితమైన ఈ బిల్లు పేరు మార్పు మినహా నేటికీ ఆమోదానికి నోచుకోలేదు.
విలీనం పేరిట కాలయాపన..
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్‌లను సమీప స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని మూడేళ్ల క్రితమే కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయగా, తెలంగాణ ప్రభుత్వం భేషరతుగా అంగీకరిస్తూ తక్షణమే స్పందించింది. దీంతో 2023 జనవరి 4న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విధి, విధానాలపై చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్‌ల విలీనానికి సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం ఊసే లేకుండా పోయింది. 2024 జూన్‌లో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇదిలా ఉండగా, 2023 ఫిబ్రవరిలో కంటోన్మెంట్‌లకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం, అర్ధంతరంగా ఉపసంహరించుకుంది.


