సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ సినిమాల పైరసీ అడ్డుకట్ట పోలీసులకు మరింత సవాలుగా మారింది. ఐబొమ్మ,బప్పంటీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాతే ఇబ్బడి ముబ్బడిగా కొత్తకొత్త పైరసీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. విడుదలైన మరుసటి రోజే కొత్త సినిమాలు సదరు పైరసీ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు సైతం పైరసీసైట్‌లో అప్‌లోడ్ చేయడంపై సినీ దర్శక,నిర్మాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రెండ్రోజుల కిందట ప్రేమంటే,12ఏ రైల్వే కాలనీ,రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు థియేటర్‌లలో విడుదలయ్యాయి. ఆ సినిమాలే ఇప్పుడు పైరసీ వెబ్‌సైటలో అప్‌లోడ్ చేసి ఉన్నాయి. థియేటర్‌లో కెమెరా ద్వారా రికార్డ్ చేసి వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు సైబర్ క్రైమ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మడి రవి అరెస్టుతో సినిమా పైరసీ ముఠాకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తూ..ఇబ్బడి ముబ్బడిగా పైరసీ వెబ్‌సైట్లు తయారు చేసి వాటిల్లో కొత్త సినిమాల్ని పైరసీ చేస్తుండగా.. సంబంధిత పైరసీ వెబ్‌సైట్‌ల లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో పైరసీ వెబ్‌సైట్లపై పోలీసుల తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది తెలియాల్సి ఉండగా.. అరెస్టు అనంతరం ఇమ్మడి రవి నియమించిన వ్యక్తులే కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు పైరసీ నడిపించేది ఒక్కరే అనుకున్నా.. ఇప్పుడు పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుండడంపై రవి వేర్వేరు దేశాల నుంచి పైరసీ దందా నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని సమాచారం. అయితే, ఐబొమ్మ రవి అరెస్టయినా కొత్త సినిమాలు పైరసీ జరుగుతున్నట్లు తేలింది.
సోషల్‌మీడియాలో భారీ ఫాలోయింగ్
చట్టప్రకారం ఇమ్మడి రవి చేసింది నేరం. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి అరెస్టు విషయం తెలిసినప్పటి నుంచి పుంఖానుపంఖాలుగా గ్రూపులు ఏర్పాడుతున్నాయి. వివిధ వెబ్‌సైట్లలో రవి అరెస్టు వార్తను చూసిన అతడి అభిమానులు కామెంట్లలో తమ మద్దతు తెలుపుతున్నారు. ‘ఐబొమ్మ పోరాట సమితి’, ‘అమీర్‌పేట కుర్రాళ్లు’, ‘రవి ఫ్యాన్ క్లబ్’ పేర్లతో గ్రూపులు కనిపిస్తున్నాయి.
‘సినిమా విడుదల సందర్భంలో రేట్లు పెంచేస్తూ ప్రభుత్వమే జీఓలు ఇస్తుంది. అలా పేద వాడికి దూరమైన సినిమాను విడుదలైన కొన్ని గంటల్లోనే రవి ఉచితంగా అందిస్తున్నాడు. అది తప్పెలా అవుతుంది?’ అని, ‘ఇప్పుడిక అమీర్‌పేట కుర్రాళ్లు, మిడిల్ క్లాస్ స్టూడెంట్ల పరిస్థితి ఏమిటో?’ అని కామెంట్లు కనిపిస్తున్నాయి.


