చంద్రశేఖర్, రామచందర్, మల్లేశ్‌కుమార్ (ఫైల్)
బాసర వద్ద గోదావరిలో నీటమునిగి ముగ్గురు అన్నదమ్ముల మృతి
భైంసా/బాసర: తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం నిర్మల్ జిల్లా బాసరకు వచ్చిన ఓ కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు.. పుణ్యస్నానాల కోసం గోదావరిలో దిగి గల్లంతై మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌లోని కాచిగూడ చెప్పల్ బజార్ ప్రాంతంలో నివసించే నీలి నాగభూషణ్‌కు నీలి చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్‌కుమార్ (31) కుమారులు ఉన్నారు.
రెండో కుమారుడైన రాంచందర్–అశ్విని దంపతుల కుమారులు వసంత్ (6), విజయ్ (2)కు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం మధ్యాహ్నం వారంతా బాసర చేరుకున్నారు. అధిక మాసం సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని అనుకున్నారు.
ఈ క్రమంలో నదిలోకి దిగిన చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్‌కుమార్ లోతు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లారు. అయితే తొలుత ఒకరు నీటిలో మునిగిపోతుండటంతో మిగిలిన ఇద్దరు అతన్ని కాపాడే ప్రయత్నంలో వారు కూడా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డుపై ఉన్న మిగిలిన కుటుంబీకులు హాహాకారాలు చేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత రెస్క్యూ సిబ్బంది సుమారు రెండు గంటలపాటు గాలించినా గల్లంతైన సోదరుల జాడ తెలియలేదు.
చివరకు బాసరకు చెందిన గంగపుత్రులు నదిలో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. కళ్లెదుటే ముగ్గురు కొడుకులు గల్లంతు కావడాన్ని చూసిన తండ్రి నాగభూషణ్ కుప్పకూలిపోగా మిగిలిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. మృతదేహాలను సీఐ దీపక్ భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సోదరులు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో చిరు వ్యాపారం చేసుకొనేవారు.


