సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు | Supreme Court again faults CM Revanth Reddy over comments on bypolls | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

Apr 3 2025 11:44 AM | Updated on Apr 3 2025 1:38 PM

Supreme Court again faults CM Revanth Reddy over comments on bypolls

న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో.. సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

 ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్‌ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్‌ తరఫున సీఎం ఎలా కామెంట్‌ చేస్తారు?. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్‌ ఆర్యమ వాదించారు.

దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై   మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీఎం కొంత మేర సంయమనం  పాటించాలి. గతంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది.  మేము సంయమనం పాటిస్తున్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి.   అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తాం.. 

.. గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత నియంత్రణ పాటించాలి కదా?. ఆ సమయంలో మేము చర్యలు తీసుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేతలు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితిని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి?..’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్‌ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. 

రేవంత్‌ ఏమన్నారంటే..
మార్చి 26వ తేదీన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం రేవంత్‌ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్‌ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement