ఈత రాకున్నా నదిలోకి వెళ్లి.. | Six students go missing while taking bath in Godavari | Sakshi
Sakshi News home page

ఈత రాకున్నా నదిలోకి వెళ్లి..

Jun 8 2025 2:54 AM | Updated on Jun 8 2025 2:54 AM

Six students go missing while taking bath in Godavari

గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల గల్లంతు 

ఒకరిని కాపాడబోయి ఒకరు నీటమునిగిన సమీప బంధువులు 

పెళ్లి వేడుకల కోసం వచ్చి మేడిగడ్డ చూసేందుకు వెళ్లి.. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలో ఘటన

భూపాలపల్లి/కాళేశ్వరం: వారంతా విద్యార్థులు.. పైగా సమీప బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు... ఎవరికీ ఈత రాకున్నా మేడిగడ్డను చూసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని నదిలోకి దిగారు. కానీ నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 

గ్రామానికి చెందిన గోల్కొండ మల్లయ్య కుమార్తె త్రివేణి వివాహం ఈ నెల 5న జరిగింది. వివాహం అనంతరం సమీప బంధువులైన అదే గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్‌ (18), పట్టి శివమనోజ్‌ (15), తొగరి రక్షిత్‌ (13), కర్ణాల సాగర్‌ (16)తోపాటు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్‌ (17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్‌ (19), పట్టి శివమణి.. మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్‌ వద్ద స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. 

మోకాలి లోతు నీళ్లలో స్నానం చేసే క్రమంలో ఆడుకుంటుండగా తొలుత ఒకరు నీటమునిగారు. ఆపై ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఆరుగురు నీటమునిగారు. నది ఒడ్డునున్న పట్టి శివమణి వెంటనే పట్టి మధుసూదన్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యంకాకపోవడంతో చివరకు ఒడ్డుకు వచ్చేశాడు. మిగిలిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. 

వద్దని వారిస్తున్నా వినకుండా...  
అంబట్‌పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్‌ ఉన్నారు. వారితోపాటు మిగిలిన ఐదుగురు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా వెంకటస్వామి అడ్డుకున్నాడు. నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉందని.. వెళ్లొద్దని వారించినా వినకుండా వారు వెళ్లా రు. దీంతో అతను కూడా వారితో అక్కడికి వెళ్లాడు. మోకాలి లోతు వరకు వెళ్లాక తిరిగి రావాలని పిలుస్తున్న క్రమంలోనే తన కుమారులు సహా ఆరుగురు ఒకరి వెనుక ఒకరు నీటము నగడంతో వెంకటస్వామి అచేతన స్థితిలో ఉండిపోయాడు. 

ఘటనాస్థలిలో 5,100 క్యూసెక్కుల నీరు..  
కొద్ది రోజులుగా గోదావరి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదం జరిగిన మేడిగడ్డ ఎగువ భాగం మూడో బ్లాక్‌లో ప్రస్తుతం 5,100 క్యూసెక్కుల నీరు ఉంది. పిల్లలు నీటిని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగురు యువకుల గల్లంతు వార్త తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు.  

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి 
హసన్‌పర్తి: వరంగల్‌ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్డిపురం చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మునిగి మృతిచెందాడు. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్‌ గణేష్‌ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సెకండియర్‌ చదువుతున్నాడు. అదే హాస్టల్‌లోని నలుగురు స్నేహితులతో కలిసి రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. 

గణేశ్‌ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి తేజావత్‌ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement