పెన్షను..పేదల్లో టెన్షను! | Poor people are eagerly waiting for new pensions in Telangana | Sakshi
Sakshi News home page

పెన్షను..పేదల్లో టెన్షను!

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

Poor people are eagerly waiting for new pensions in Telangana

పాతవి, కొత్తవి కలిపి సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో..

కొత్త పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా పేదల ఎదురుచూపులు 

అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తం పెంచుతామన్న కాంగ్రెస్‌ పార్టీ... 2026–27 బడ్జెట్‌లో 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు  

ఎలాంటి పెంపుదల లేకుండా పాత పింఛన్ల పంపిణీకి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయం 

తాజాగా జూన్‌ 2న కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్టు ప్రకటన 

తొలుత వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఇస్తామని వెల్లడి 

ఇప్పటికీ మొదలుకాని ప్రక్రియ..  

కేవలం 2 లక్షల కొత్త పింఛన్లు మాత్రమే ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితిపై సందిగ్ధత!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త చేయూత పింఛన్ల కోసం పేదలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మీకులు..ఇలా అనేక కేటగిరీలకు చెందినవారు పింఛన్ల కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కరుణిస్తుందన్న ఆశతో కార్యాల యాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు కలిపి.. దాదా పు నాలుగేళ్లుగా చేయూత కోసం నిరీక్షిస్తున్నా రు. సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా కాగా..వీటి పరి ష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖ లాలు కన్పించక పోవడంతో పింఛన్ల అంశం అంతుచిక్కని వ్యవహారంగా మారింది.   

పెంపు సరే.. మంజూరేదీ? 
కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల నుంచి), వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల పింఛను రూ.4 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల నుంచి) పెంచుతామని హామీ ఇచ్చింది. 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు.. కొత్తగా వివిధ  కేటగిరీలకు చెందిన 2 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు (ఎలాంటి పెంపుదల లేకుండా) మంజూరు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2 నుంచి కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్టు  ప్రకటించింది. ప్రథమ ప్రాధాన్యత కింద వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులకు కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.  

దరఖాస్తుల స్వీకరణే..స్రూ్కటినీ లేదు 
మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో వివిధ కేటగిరీల వారి నుంచి దరఖాస్తులైతే తీసుకుంటున్నారు కానీ వాటి  పరిశీలనే (స్క్రూటినీ) పూర్తి చేయడం లేదు. దరఖాస్తులను స్క్రూటినీ  చేయాలనే ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు అందలేదు. అసలు ఎప్పటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఉన్నతాధికారులు..అప్పుడే అర్హుల జాబితాను సిద్ధం చేసి పంపవద్దంటూ జిల్లా, మండల అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ముందుగా ఆయా కేటగిరీల కింద అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అర్హులను గుర్తించాక పరిశీలనకు క్షేత్రస్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి పింఛన్‌దారుడు అర్హుడనే నివేదిక అందాక డేటా ఎంట్రీ చేసి ఆమోదం తెలుపుతారు. కానీ ఈ ప్రక్రియలో ఎలాంటి ముందడుగూ పడటం లేదని ఎక్కడికక్కడే మూలుగుతున్న దరఖాస్తులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మొత్తంగా 20 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే.. రెండులక్షలు మాత్రమే కొత్త పింఛన్లు ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితిని, ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అన్న సందిగ్ధంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.  

అంతకంతకూ పెరుగుతున్న ఆశావహుల సంఖ్య 
రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద చేయూత పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 41,48,071గా ఉంది. వాస్తవానికి 2023 డిసెంబర్‌ చివరినాటికి వివిధ కేటగిరీల పింఛ¯న్‌దారుల సంఖ్య 43,55,649 కాగా.. అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు వివిధ కేటగిరీల కింద పింఛను పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాలతో 3.5 లక్షల పించన్లు తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 2 లక్షల మందికి పాత మొత్తంతోనే పింఛన్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  

ప్రజా పాలనలో లక్షల్లో దరఖాస్తులు 
కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా ప్రజాపాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా, ఇతర రూపాల్లో..పింఛన్ల కోసం 19 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, 4 లక్షల దాకా వితంతు, 3 లక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 70 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీటన్నింటినీ చేయూత పింఛన్ల మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే ఎంతమంది అర్హులనేది తేలుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే బడ్జెట్‌ కొరత, సాంకేతిక కారణాల వల్ల కొత్త పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. 

వారం వారం తిరుగుతూనే ఉన్నా.. 
వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఐదేళ్లు అయింది. గత ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా. వారం వారం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినా ఇప్పటివరకు రాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.  
– చంద్రకళ, మరికల్, నారాయణపేట 

నాలుగేళ్లలో మూడుసార్లు దరఖాస్తు 
కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నాకు ఒక కాలు పూర్తిగా తీసేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సదరం సర్టిఫికెట్‌ తీసుకున్నా. నాలుగేళ్లలో మూడుసార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రతీసారి ఎంక్వయిరీ చేసి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు నాకు పెన్షన్‌ అందలేదు. 
– మీర్జా ఇస్మాయిల్,  దివ్యాంగుడు, సుభాష్‌నగర్‌ (కరీంనగర్‌)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement