లబ్ధిదారుకు మంజూరు పత్రం అందజేస్తున్న మంత్రి పొంగులేటి
రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
ఎకరం రూ.260 కోట్లు పలికే చోట ఇందిరమ్మ ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడు కోటీశ్వరుడే
గచ్చిబౌలి: పేదల ఇళ్ల నిర్మాణ విషయంలో విమర్శలు సరికాదని.. రాజకీయాలకు అతీతంగా గులాబీ చొక్కా వేసుకున్న పేదవారికి కూడా ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇల్లంటే నాలుగు గోడలు, పైకప్పు కాదన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో 2.85 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 480 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ, ఒప్పందాలు పూర్తయ్యాయని చెప్పారు.
మరో 4–5 నియోజకవర్గాల్లో టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఎకరం రూ. 260 కోట్లు విలువ చేసే ప్రాంతంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల అన్‌డివైడెడ్ షేర్‌తో పోల్చుకుంటే ప్రతి లబ్ధిదారుడు కోటీశ్వరుడేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరగని దరఖాస్తుదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. ఐదు విడతలుగా ఇళ్లు నిర్మించి అర్హులైన పేదలకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
భవిష్యత్ తరాలకు మిగిలే ఆస్తి
ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్లు ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ కాదని.. లబ్ధిదారుల పిల్లలకు, భవిష్యత్ తరాలకు మిగిలే ఆస్తి అని మంత్రి పొంగులేటి తెలిపారు. అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్ ఉందని పిల్లలు గర్వంగా చెప్పుకొనేలా ఇంటిని కాపాడుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పెళ్లి, చదువులకు ఆర్థిక ఇబ్బందులుంటే ఇందిరమ్మ ఇళ్లపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ కుమార్, అదనపు కలెక్టర్ కిరణ్మయి, యాదవ కార్పొరేషన్ చైర్మŒన్ రఘునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


