పెద్దపల్లి రూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని మున్సిపల్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) కల్లెపల్లి సతీశ్‌కుమార్ మంగళవారం తన ఇంట్లో బత్తుల శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
శ్మశానవాటికలు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైనల్ బిల్లు రూ.12,28,748 కాంట్రాక్టర్‌కు విడుదల చేసేందుకు సతీశ్ రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పినా.. ఇవ్వాల్సిందేనని చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వారి సూచన మేరకు రూ.2 లక్షలను మంగళవారం కాంట్రాక్టర్ బత్తుల శ్రీనివాస్ పట్టణ శివారు రంగంపల్లిలోని ఏఈ సతీశ్ ఇంట్లో ఇస్తుండగా డీఎస్పీ మహేందర్‌రెడ్డి సారథ్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సోదాల్లో లెక్కతేలని రూ.32 లక్షలు..
సతీశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కగా.. అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కతేలని రూ.32,31,900 విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని కూడా అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ డబ్బు భూమి అమ్మగా వచ్చిందని ఏఈ చెబుతున్నారని, అందుకు ఆధారాలు సమరి్పంచి తిరిగి పొందొచ్చని డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోనూ రికార్డులను పరిశీలించారు. సతీశ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు డీఎస్పీ వివరించారు.


