ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్‌ కేసు: ఏం జరిగిందో చెప్పిన ఆకాష్‌ | MLA Lasya Nanditha Case: Akash Says this To Police | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్‌ కేసు: ఏం జరిగిందో చెప్పిన ఆకాష్‌

Feb 24 2024 12:58 PM | Updated on Feb 24 2024 1:25 PM

MLA Lasya Nanditha Case: Akash Says this To Police - Sakshi

లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం.

హైదరాబాద్‌, సాక్షి: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్‌ కేసులో.. ఆమె పీఏ-డ్రైవర్‌ ఆకాష్‌పై కేసు నమోదైందన్న విషయం తెలిసిందే. ఆకాష్‌ నిర్లక్ష్యపూరితంగా వాహనం నడపడం వల్లే లాస్య చనిపోయిందని  ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్‌ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు పటాన్‌చెరు పోలీసులు.

మేజిస్ట్రేట్ సమక్షంలో స్పృహలో ఉన్న ఆకాష్ వాం‍గ్మూలం ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్‌లో.. ‘‘దర్గా నుండి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది’’ అని ఆకాష్‌ పేర్కొన్నారు.  

ఇక ప్రమాదం జరిగిన తీరును స్థానిక డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్‌ఆర్‌పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్‌కు ఢీ కొట్టింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉన్నాయి. నిర్లక్షం గా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగింది’’ అని వివరించారు.

లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్‌ మీద ఐపీసీ సెక్షన్‌ 304 ఏ కింద పటాన్‌చెరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వేకువఝామున ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్‌ తమకు ఫోన్‌ చేశాడని, ప్రమాదం జరిగి.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్‌ షేర్‌ చేశాడని నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తీరా స్పాట్‌కు తాము వెళ్లి చూస్తే.. నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉందని ఆమె తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాతే టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో లాస్య చనిపోగా.. ఆకాష్‌ కాళ్లు విరిగాయి. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి  లాస్య కారు ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించారు.  నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు ఆకాష్‌ చెప్తున్నప్పటికీ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement