మిల్లా మ్యాగీ వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన | Miss England Milla Magee Row: Telangana Govt Probe Done | Sakshi
Sakshi News home page

మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

May 30 2025 1:51 PM | Updated on May 30 2025 3:42 PM

Miss England Milla Magee Row: Telangana Govt Probe Done

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ(Milla Magee) సంచలన ఆరోపణల వ్యవహారంపై విచారణ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై తెలంగాణ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ సాక్షితో శుక్రవారం మాట్లాడారు.

‘‘మిస్‌ ఇంగ్లండ్‌ మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది. అయితే ఆమె విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు లండన్‌లో కేసు వేశారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్‌ చర్యలు తీసుకుంటుంది’’ అని జయేష్‌ రంజన్‌(Jayesh Ranjan) స్పష్టం చేశారు.

వ్యక్తిగత, నైతిక కారణాలను చూపుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ 2025 (Miss World 2025)పోటీల నుంచి నిష్క్రమిస్తూ మిల్లా మ్యాగీ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆపై ఆమె బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా. తెలంగాణపై గౌరవం పెరిగింది. అక్కడి అతిథ్యం బాగుంది. కానీ, మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలు?’’ అని ఆమె అన్నట్లు సదరు టాబ్లాయిడ్‌ కథనం ఇచ్చింది.

అయితే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆమె పోటీ నుండి వైదొలగాలని అభ్యర్థించారని తెలిపారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు.. గౌరవం, బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ విలువలకు కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు.

అయితే ఈ వ్యవహారంపై తెలంగాణాలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement