సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి సరికొత్త లుక్‌తో మలక్‌పేట్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ అభివృద్ధి కోసం రూ.26.50 కోట్లతో దక్షిణమధ్య రైల్వే పనులు చేపట్టింది. ఇప్పటి వరకు గ్రౌండ్‌ఫ్లోర్, టెర్రస్ స్లాబ్ నిర్మాణం పూర్తి చేశారు. మొదటి అంతస్తులో బుకింగ్ కార్యాలయం ఆధునికీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ప్లాట్‌ఫామ్ సరిహద్దు గోడ, వయా డక్ట్ పనులను కూడా పూర్తి చేశారు. ప్లంబింగ్, ప్లాస్టరింగ్ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్ షెడ్ల కోసం నిర్మాణ పనులను ప్రారంభించారు.
మలక్‌పేట్ స్టేషన్ (Malakpet Railway Station) పునరాభివృద్ధిలో భాగంగా 12 మీటర్ల వెడల్పయిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్‌ల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలో ప్లాట్‌ఫామ్‌ల పై కప్పు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో రైల్వేశాఖ భారీఎత్తున రైల్వేస్టేషన్‌ల పునరాభివృద్ధి కొనసాగుతోంది.
తెలంగాణలో సుమారు రూ.2,750 కోట్లతో 40 రైల్వే స్టేషన్లనను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 2023 ఆగస్టులో పునరభివృద్ధి పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సికింద్రాబాద్ రీడెవలప్‌మెంట్ పనులు కొనసాగుతుండగా, బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్‌ల పునరాభివృద్ధి పూర్తయింది. ఈ మూడు స్టేషన్‌లను ప్రధాని ఇటీవల ప్రారంభించారు.

మలక్‌పేట్ పునరాభివృద్ధిలో భాగంగా...
⇒ మలక్‌పేట్ స్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు కాచిగూడ – కర్నూలు, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, కాచిగూడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉంది.
⇒ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ ఆవరణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.
⇒ ప్రవేశ ద్వారాన్ని కళాత్మకంగా పునర్‌నర్మించనున్నారు.
⇒ ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు,సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. రైళ్ల సమాచార బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు.
⇒ ప్రవేశ ద్వారాలను పునరుద్ధరిస్తారు. కొత్తగా 2 లిఫ్టులు, మరో 2 ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ల్యాండ్ స్కేపింగ్. స్టేషన్ ప్రవేశద్వారం వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు మెట్రో స్టేషన్ నుంచి మలక్‌పేట్‌కు రాకపోకలు సాగించేలా అనుసంధానం చేయనున్నారు.


