24 గంటల వ్యవధిలో ప్రేమికుల బలవన్మరణం ఇరు కుటుంబాల్లో తీరని శోకం
యాచారం, హయత్‌నగర్: ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలిగొనడంతో పాటు ఇరుకుటుంబాల్లో తీరని విషాదం నింపింది. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని యాదయ్య, పార్వతమ్మల కుమారుడైన మహేశ్ (20), పోతురాజు మహేశ్, అలివేలు కూతురు పూజ (17) ప్రేమించుకున్నారు. పూజ ఇంటర్ సెకండియర్, మహేశ్ డిగ్రీ చదువుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ప్రాణాలతో బయటపడి, పరిస్థితి సద్దుమణుగుతోందనుకుంటున్న సమయంలో మహేశ్ మళ్లీ పూజకు ఫోన్ చేసి, తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చనిపోతానని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో పూజ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో మహేశ్ వేధింపులు తీవ్రం చేయగా, మనస్తాపానికి గురైన పూజ మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు చనిపోవడం, పోలీసులు తనకోసం వెదకడంతో ఆందోళనకు గురైన మహేశ్ మంగళవారం గ్రామం వదిలి, హయత్‌నగర్‌లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు.
పూజ మృతితో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతో భయాందోళనకు గురైన అతను బుధవారం ఉదయం హయత్‌నగర్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. లొకేషన్ ఆధారంగా వెళ్లిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. 24 గంటల్లో ఇద్దరి మృతితో నక్కర్తమేడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


