మల్టీలెవల్ పార్కింగ్ ఉన్నా సరిపోని దుస్థితి
సీఎం దృష్టి సారిస్తేనే సమస్యకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు(కేబీఆర్) పేరు చెబితే ట్రాఫిక్ ఇబ్బందులు గుర్తుకువస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ప్రాంతం వాహనాలతో కిక్కిరిపోతుంది. ఈ క్రమంలో ఉదయం, సాయంత్రం వేళలో వేలాది మంది వాకర్లతో పాటు మిగతా సమయాల్లో సందర్శకులు పెద్ద సంఖ్యలో పార్కుకు వస్తుంటారు. రోజురోజుకూ పెరుగుతున్న వాకర్ల సంఖ్య, వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కు వద్ద పార్కింగ్ సదుపాయం పెరగడం లేదు. దీంతో వాకర్లకు కష్టాలు తప్పడం లేదు.
కేబీఆర్ పార్కుకు ప్రతిరోజూ ఉదయం వెయ్యికిపైగా, సాయంత్రం 500లకు పైగా వాకర్లు వస్తుంటారు. శని, ఆదివారాల్లో మాత్రం ఈ సంఖ్య రెండింతలు దాటుతోంది. ఇందుకు తగినట్లు పార్కింగ్ సౌకర్యం కల్పించడంలో ఇటు అటవీశాఖ, అటు జీహెచ్‌ఎంసీ అధికారులు చేతులెత్తేసి చోద్యం చూస్తున్నారు. పార్కుకు వచ్చే వాకర్లకు ఏర్పడుతున్న సమస్యను ఈ రెండు శాఖలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. రోడ్డు పక్కన వాహనం ఆపితే నో పార్కింగ్ అంటూ ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి ఇ–చలాన్లు పంపిస్తున్నారు. పార్కు గేటు వద్ద వాహనాలను నిలిపితే అటు కేబీఆర్ పార్కు నిర్వాహకులు, ఇటు జీహెచ్‌ఎంసీ (GHMC) సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు.
మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించినా..?
కేబీఆర్ పార్కు వద్ద పార్కింగ్ సమస్యను కొంత మేరకు నియంత్రించడానికి పార్కును ఆనుకుని జీహెచ్‌ఎంసీ పార్కింగ్ స్థలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీలెవల్ కారు పార్కింగ్ (Multi level car parking) నిర్మించారు. ఆర్నెళ్ల క్రితం ఇది అందుబాటులోకి వచ్చింది. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఇక్కడ 72 కార్లను పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే ఇది ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇలాంటి మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యాన్ని పార్కు చుట్టూ మరో ఆరు చోట్ల కల్పిస్తే సమస్యకు కొంత వరకైనా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలోని చిచ్చాస్ రెస్టారెంట్ పార్కింగ్ స్థలంలో, ఫిలింనగర్‌లోని సీవీఆర్ న్యూస్ ఎదురుగా, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్– 92లోని తాజ్‌మహల్ హోటల్ ఎదురుగా, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఎదురుగా, కేబీఆర్ పార్కు (KBR Park) చివరి పార్కింగ్ స్థలంలోనూ మల్టీలెవల్ పార్కింగ్‌లను నిర్మించడానికి తగిన స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు చుట్టూ ఉన్న కొన్ని ప్రభుత్వ స్థలాలను కూడా సేకరించి ఇప్పుడే ఈ పార్కింగ్ వ్యవస్థను నిర్మిస్తే చాలావరకు పార్కింగ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వాకర్లు అంటున్నారు.
కరువైన సమన్వయం..
కేబీఆర్ పార్కు నిర్వహణ అటవీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. రోజువారీ టిక్కెట్లు, వార్షిక పాస్‌ల రూపంలో డబ్బులు వసూలు చేసి వాకర్లను పార్కు లోపలికి పంపించడం వరకే అటవీ శాఖ అధికారులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. పార్కుకు వచ్చే వాహనదారులు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో వీరికి పట్టడం లేదు. వాకర్లకు, సందర్శకులకు పార్కింగ్ సదుపాయం కోసం అటవీ శాఖ అధికారులు ఏనాడూ దృష్టి పెట్టలేదు. జీహెచ్‌ఎంసీతో సమన్వయం కూడా కరువైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు, అటవీ శాఖ అధికారులు సమన్వయంగా వ్యవహరించి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో సమీక్షిస్తే కొంతవరకు పరిష్కారం లభిస్తుందని వాకర్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రతిరోజూ ఈ పార్కు ముందు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.
చదవండి: 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
వందలాది మంది ప్రముఖులు నిత్యం వాకింగ్ చేస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పార్కుకు సరైన పార్కింగ్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ పార్కింగ్ పంచాయతీని సీఎం వద్దకు తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని వాకర్లు అంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లు ఇక్కడ పార్కింగ్ సమస్య పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


