వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
నగరంలోని స్టార్ హోటళ్లలో అతిథులకు బస
మహిళా పారిశ్రామికవేత్తల కోసం స్పెషల్ ఉమెన్స్ వింగ్
వేదిక చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2047’కు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పిస్తోంది. వీవీఐపీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం, అంతరాయం కలగకుండా అడుగడుగునా నిఘా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) డీఎస్ చౌహాన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో వంద ఎకరాల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2047’ను (Telangana rising global summit 2047) నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సుమారు 2,500 మంది పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్స్‌తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ వేదికను రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు పలుమార్లు సందర్శించారు.
మూడంచెల భద్రత..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల ప్రతినిధులు, బహుళ జాతి సంస్థల అధినేతలు, దేశీయ సంస్థల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు సుమారు 500–600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరి సహాయక సిబ్బంది సుమారు 3 వేల మంది రానున్నారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. పోలీసు బలగాలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ కూడా భద్రతా ఏర్పాట్లలో పాలుపంచుకోనుంది. ప్రొటోకాల్, గెస్ట్ మేనేజ్‌మెంట్ కోసం బందోబస్తులో పాల్గొనే పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంటెలిజెన్స్ అధీనంలో..
గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయి. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ యూనిట్ అధీనంలో ఉంటుంది. వీఐపీ సహాయక సిబ్బంది ధ్రువీకరణ, బ్యాంక్ గ్రౌండ్ చెక్ పూర్తయిన తర్వాతే సమ్మిట్‌లోకి ఆహ్వానం ఉంటుంది. రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) పాస్‌లను ఇస్తారు.
ట్రాఫిక్ మార్షల్స్..
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నారు. రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి వాటి కోసం ట్రాఫిక్ మార్షల్స్‌ను నియమించుకోనున్నారు. అతిథుల పికప్–డ్రాప్‌తో పాటు వాహనాల మూవ్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తుంటారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రముఖుల కోసం ఏసీ బస్‌లు, వాహనాలలో భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు జరగకుండా ఆయా మార్గాలను పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. సాధారణ ప్రజలు, వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాలలో రహదారుల మళ్లింపులు ఉంటాయి.
ప్రత్యేకంగా ఉమెన్స్ వింగ్..
మహిళా పారిశ్రామికవేత్తలు, వక్తలు, పెట్టుబడిదారుల భద్రత, రక్షణ కోసం ఉమెన్స్ వింగ్, షీ టీమ్స్ ప్రత్యేకంగా వింగ్‌ను ఏర్పాటు చేశారు. రెండు రోజు ల ఈ సమ్మిట్‌లో ప్రతినిధులకు నగరంలోని ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తున్నారు. వెస్టిన్, ట్రైడెంట్, ఐటీసీ కోహినూర్ వంటి హోటళ్లతో ఒప్పందం చేసుకున్నారు. ఆయా హోటళ్లలో ‘గ్రేడ్– ఎ’ ప్రముఖుల కోసం 300 గదులను బుక్ చేశారు. 500 మంది హై ప్రొఫైల్ వీఐపీ అతిథులకు ఐటీసీ హోటల్‌లో ఆతిథ్య ఏర్పాట్లు చేస్తున్నారు.


