ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది జూలై 31 వరకు పొడిగింపు
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర జలశక్తి శాఖ
12 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రిబ్యునల్ విచారణ
ఇప్పటికీ కొలిక్కిరాని జలాల పంపిణీ
తెలంగాణ, ఏపీల మధ్య తెగని వివాదాలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ కాగా.. ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నిర్దేశిత కేటాయింపులు జరిపే బాధ్యతను తొలుత కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.
తెలంగాణ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం(ఐఎస్‌డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్రం మళ్లీ ట్రిబ్యునల్‌కు అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా కేటాయించిన జలాలను కలిపి మొత్తం 1005 టీఎంసీలను తిరిగి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
సుప్రీంకోర్టు ఏం చెబుతుందో..
తమ రాష్ట్ర ప్రయోజనాలను హరించే ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, దీనిపై నిర్ణయం తీసుకునే వరకు ట్రిబ్యునల్ విచారణను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సెక్షన్ 89 కింద అప్పటివరకు జరిపిన విచారణను ట్రిబ్యునల్ పక్కనబెట్టి సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన రెఫరెన్స్ ఆధారంగా కొత్తగా విచారణను చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ వాదనలు ముగిశాయి.
మరో రెండు మూడు నెలల్లో ఏపీ వాదనలూ ముగియనుండగా, ఆ తర్వాత ఆ వాదనలను ఖండిస్తూ తెలంగాణ తుది వాదన వినిపించనుంది. అనంతరం ట్రిబ్యునల్ సెక్షన్ 3 కింద తీర్పును రిజర్వ్ చేసి ఆ వెంటనే ప్రకటించడం కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూస్తూ వాయిదా వేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద మళ్లీ రెండు రాష్ట్రాల వాదనలను పునః ప్రారంభించనుంది.
ఆలోగా సుప్రీంకోర్టు సెక్షన్–3 కింద నీటి పంపకాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సెక్షన్ 89 కింద విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు సెక్షన్ 3 కింద కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్‌ను కొట్టివేస్తే మాత్రం సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్‌లో విచారణ మరి కొన్నేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు సెక్షన్ 3 కింద ఇప్పటివరకు ట్రిబ్యునల్ జరిపిన విచారణ వృథా ప్రయాస కానుంది.
పొడిగింపులే పొడిగింపులు
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్ 4 కింద 2004 ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తన తొలి నివేదిక, తీర్పును 2010 డిసెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత భాగస్వామ్య రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు 2011 మార్చి 29న ట్రిబ్యునల్‌కు తమ సూచనలు (రెఫరెన్స్) పంపాయి.
అనంతరం ట్రిబ్యునల్ తన తదుపరి నివేదికను 2013 నవంబర్ 29న కేంద్రానికి సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం–2014 లోని సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్ గడువును పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆ చట్టంలోని క్లాజ్ (ఎ), క్లాజ్ (బి) లోని అంశాల పరిష్కారం నిమిత్తం 2014 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు గడువును పొడిగిస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చారు.
ఆ తర్వాత ట్రిబ్యునల్ అభ్యర్థనల మేరకు కాలానుగుణంగా ప్రతి ఏటా కేంద్రం గడువును పొడిగిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెగడం లేదు. నీటి కేటాయింపులు లేక కృష్ణా పరీవాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు.


