
గొడ్డలితో దాడి చేసిన భర్త
నారాయణపూర్‌లో ఘటన
కొమరంభీం జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన ఘటన మండలంలోని నారాయణపూర్‌లో చోటుచేసుకుంది. రెబ్బెన సీఐ సంజయ్ కథనం ప్రకారం.. నారాయణపూర్ గ్రామానికి చెందిన గజ్జల తిరుపతి, మంచిర్యాల జిల్లా బూదకలాన్‌కు చెందిన స్రవంతి (38) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. తిరుపతి వ్యవసాయ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిచేస్తున్నాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. గత కొంతకాలంగా తిరుపతి మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో భార్యను ఎలాగైన హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు.
శనివారం తెల్లవారుజామున ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న స్రవంతి మెడ, గొంతుపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలై అక్కడిక్కక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ, సీఐ సంజయ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరును, అందుకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తమ్ముడు టేకుమట్ల సంజయ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.