ఇళ్లు్ల ఆశ చూపి ఓట్లు వేయించుకోవడం అలవాటైంది
జూబ్లీహిల్స్‌లో మజ్లిస్ నేతల దాదాగిరీ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి వివిధ కాలనీల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెబితే, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు అంటున్నారు. ఇద్దరూ మోసం చేస్తున్నారు. ఇండ్లు ఆశ చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మరచిపోవడం అలవాటైంది.
ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఈ వెనకబాటుకు కారణం ఎవరు? గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దీనికి బాధ్యులు కావా? ఆ పార్టీల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి పట్టింది’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘మజ్లిస్ కార్పొరేటర్లు, నాయకులు దాదాగిరి చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వీరి ఆగడాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
మన బిడ్డలను మనం రక్షించుకోవాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, నియోజకవర్గం బాగుపడాలన్నా బీజేపీని గెలిపించాలి’అని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు, రూ.4వేల నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధం
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ, కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ ఈ పార్టీలు కేంద్రంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని, కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని తెలిపారు. 2014లో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందని, 2023 జూన్ 7న తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పేరిట బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తాను ప్రజెంటేషన్ ఇచ్చానని వివరించారు.
మరోసారి తెలంగాణ అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చ జరిగేవిధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు కిషన్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బహిరంగ చర్చ జరిపేందుకు రెడీగా ఉన్నామన్నారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరినీ ఆహ్వానించాలని ప్రెస్ క్లబ్‌ను కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష పార్లమెంటరీ పద్ధతిలో ఉండేలా, సానుకూల చర్చ జరిగే విధంగా చూడాలని సూచించారు.


