ఇంటర్‌లోనే ఇలా ఎందుకు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లోనే ఇలా ఎందుకు

Published Sun, Dec 24 2023 5:25 AM

Inter Board: 70 percent of exam results are also difficult - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువగా ఉంటుందనే విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించా­రు. 2024లో జరిగబోయే పరీక్షల్లో దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఎక్కువగా ఏ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతున్నారు? వా­రికి రివిజన్‌ చేయడం ఎలా? అనే అంశాలపై జి­ల్లా­ల వారీగా నివేదికలు కోరారు. రె­సిడెన్షియల్, గురుకులాల్లో మంచి ఫలితాలు వ­స్తు­న్నా, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఆశించిన ఫలి­తాలు రావడం లేదు. కోవిడ్‌ తర్వాత 70 శాతం రిజల్ట్‌ కష్టంగా ఉందని గుర్తించారు. మెరుగైన ఫలితాలు సాధించే సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

కారణాలేంటి? 
2023లో ఇంటర్‌ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌ 4,33,082 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,72,280 మంది ఉత్తీర్ణులయ్యారు. 63 శాతం రిజల్ట్‌ వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో 4,19,267 మంది పరీక్ష రాస్తే, 2,65,584 (63 శాతం) పాసయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్‌ సెకండియర్‌లో కనీసం 50 శాతం కూడా పాసవ్వలేదు. జగిత్యాల (23శాతం), సూర్యాపేట (30శాతం), సిద్ధిపేట (34శాతం), నిర్మల్‌ (49శాతం) జిల్లాలు ఈ కోవలో ఉన్నాయి.

పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌బాద్, కరీంనగర్, వనపర్తి, జనగాం, జిల్లాల్లో 48 శాతం లోపే ఫలితాలొచ్చాయి. నారాయణపేట (100శాతం) మినహా మరే ఇతర జిల్లాలోనూ 75 శాతం ఫలితాలు కనిపించలేదు. 68 శాతం ఫలితాలు ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటే, ప్రభుత్వ కాలేజీల్లో 32 శాతం మించడం లేదు. ఈ పరిస్థితికి గల కారణాలపై ఇంటర్‌ అధికారులు దృష్టి పెట్టారు. సకాలంలో సిలబస్‌ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. రివిజన్‌ ఏమాత్రం జరగడం లేదని తెలుసుకున్నారు. జనవరి రెండోవారంలో సిలబస్‌ పూర్తి చేసి, మిగతా రోజుల్లో రివిజన్‌ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 

సీఈసీ...హెచ్‌ఈసీలోనే ఎక్కువ 
► విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే చేరుతున్నారు. సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో తక్కువగా చేరినా, వారిలోనూ చాలామంది ఫెయిల్‌ అవుతున్నారు. 

► గత ఏడాది సీఈసీలో 98 వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 37 వేల మంది (37 శాతం) మాత్రమే 2023లో ఉత్తీర్ణులయ్యారు.  

►  బైపీసీ గ్రూపులో లక్ష మంది పరీక్ష రాస్తే, 64 వేల మంది (64.14) పాసయ్యారు.  

► హెచ్‌ఈసీలో 11,294 మంది పరీక్ష రాస్తే, 3,408 మంది (30.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు.  ఫస్టియ­ర్‌ రిజల్ట్స్‌ ఇలా ఉంటే.. సెకండియర్‌లో ఫలితాలు మరీ తగ్గుతున్నాయి.  

► ఎంపీసీలో గరిష్టంగా 72 శాతం, బైపీసీలో 67 శాతం ఫలితాలు ఉంటే, హెచ్‌ఈసీలో 46 శాతం సీఈసీలో 47 శాతం ఉంటోంది. హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో సరిగా బోధన జరగడం లేదని బోర్డు అధికారులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనే ఉంటున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాల దిశగా క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement