తరగతి గదుల్లో తెలంగాణ భవిష్యత్తు | CM Revanth Says future of Telangana in classrooms | Sakshi
Sakshi News home page

తరగతి గదుల్లో తెలంగాణ భవిష్యత్తు

Jun 18 2026 4:43 AM | Updated on Jun 18 2026 4:43 AM

CM Revanth Says future of Telangana in classrooms

స్కూల్‌ కిచెన్‌లో.. పూరీని వొత్తుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణించాలి

అప్పుడే భవిష్యత్‌ తరాల తలరాతలు మారతాయి 

సంక్షేమ పథకాలతో బతుకులు మారవు 

ఆరుట్ల టీపీఎస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

పీవీ, మోదీ, నేను కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వాళ్లమే.. 

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ 

విద్యార్థులకు యూనిఫాంతో పాటు 9 రకాల వస్తువులతో కూడిన కిట్‌లు 

బడి పిల్లలకు అల్పాహారం పంపిణీ పథకం ప్రారంభించిన సీఎం

పిల్లలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్, ఫుట్‌బాల్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మారవు. అవి కేవలం బతకడానికి మాత్రమే పనికొస్తాయి. భవిష్యత్‌ తరాల తలరాతలు మారాలంటే ముందు వారు చదువుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా రాణించినప్పుడే బతుకులో మార్పు కన్పిస్తుంది. పుట్టి, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు రంగుల అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదు. తరగతి గదుల్లోనే ఉంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికేలా విద్యలో రాణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువును చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుకుని రాణించిన వాళ్లే..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌)ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బడి పిల్లలకు అల్పాహారం పంపిణీ పథకాన్నీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అటు నుంచి నేరుగా కిచెన్‌కు వెళ్లి పూరీని వొత్తారు. లైబ్రరీ, ప్రయోగశాల, మ్యూజిక్, డ్యాన్స్‌ తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. క్రీడామైదానానికి చేరుకుని పిల్లలతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడారు. విద్యార్థులు, టీచర్లతో కరచాలనం చేశారు. గ్రూప్‌ ఫొటోలు దిగారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. 

మట్టిలో మాణిక్యాలను వెలికితీసేలా.. 
‘విద్యాశాఖ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. పదేళ్ల పాలనలో విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఆరుట్ల టీపీఎస్‌లో ఇప్పటికే 1,814 మంది అడ్మిషన్లు పొందారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్‌ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక టీపీఎస్‌ నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఇక్కడ ప్రారంభించిన టీపీఎస్‌ను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు అంకితం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికే కాదు..తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులది. 

డిసెంబర్‌ 9న స్కిల్స్‌ వర్సిటీ ప్రారంభం 
ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు 9 రకాల వస్తువులతో కూడిన కిట్‌లు అందించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రూ.685 కోట్లతో టెండర్‌ పిలిస్తే..రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. జూలై ఆఖరి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు అందజేస్తాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ద్వారా కుల,మతాలకు అతీతంగా 500 మంది విద్యార్థులను ఒకేచోట చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్‌ 9న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీని ప్రారంభించనున్నాం..’అని సీఎం తెలిపారు.  

మెస్సీని తెస్తే విమర్శించారు..     
‘2034 ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధనే లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీని ఏర్పాటు చేశాం. అకాడమీల్లో ఆడే వాళ్ల కంటే..ఆరుట్ల స్కూలు పిల్లలు బాగా ఆడుతున్నారు. ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ, విద్యార్థులను కలిపి ఫుట్‌బాల్‌ ఆడించాం. క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకొస్తే రాజకీయ విమర్శలు చేశారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేయాలని భావించే వారికి భవిష్యత్తు ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’అని రేవంత్‌ ధ్వజమెత్తారు.
 
డ్రగ్స్‌ రహిత సమాజం కోసం 19న ప్రతిజ్ఞ 
‘తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌ సమస్యగా మారాయి. సరదాగా మొదలైన అలవాటు ఆ తర్వాత వాటికి బానిసలుగా మార్చుతుంది. డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం ఈ నెల 19న ఎల్బీనగర్‌లో వేలాది మంది విద్యార్థులతో ప్రమాణం చేయించబోతున్నాం. విద్యార్థులు తమ తోటి విద్యార్థులు ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటైతే ఆ విషయం వెంటనే ఉపాధ్యాయుల ద్వారా పోలీసులకు చేరవేయాలి. పోలీసులకు మీరే సమాచార వారధులుగా నిలవాలి..’అని సీఎం కోరారు.  

పేదల భూములకు విముక్తి కల్పించండి 
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఇతర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. నాగన్‌పల్లి సర్వే నంబర్‌ 189లోని పన్నెండెకరాల నాలుగు గుంటల భూమి, 203 సర్వే నంబర్‌లో ఎనిమిదెకరాల భూమిలో 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. పేదలకిచ్చిన ఇంటి స్థలాలను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం ఆక్రమించిందని వివరించారు. ఈ భూమికి విముక్తి కల్పించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement