పెట్టుబడులకు ముఖద్వారం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments at USISPF annual conference in Delhi | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ముఖద్వారం: సీఎం రేవంత్‌

Nov 14 2025 1:06 AM | Updated on Nov 14 2025 1:36 AM

CM Revanth Reddy Comments at USISPF annual conference in Delhi

గురువారం ఢిల్లీలో జరిగిన అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సిస్కో మాజీ సీఈఓ జాన్‌ చాంబర్స్, జయేశ్‌ రంజన్‌

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు 

ఢిల్లీలో యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ వార్షిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

పరిశ్రమలకు పూర్తిగా అనువైన వాతావరణం.. భద్రతకు ఢోకా లేదు 

పెద్ద సంఖ్యలో యువత,సత్వర వృద్ధి రేటుతో తెలంగాణ 

గత 23 నెలల్లో ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలు 

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం 

పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి 

తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ ప్రదర్శించిన సీఎం 

ప్రశంసలు కురిపించిన టెక్‌ దిగ్గజాలు

గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరవుతాం  
తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు మా సభ్యులలో ఎక్కువ మంది డిసెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ   రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరవుతాం. తెలంగాణ విజన్‌ను సమీపం నుంచి తెలుసుకోవాలని మేమంతా ఆసక్తితో ఉన్నాం. 
–  డాక్టర్‌ ముఖేష్‌ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అధ్యక్షుడు

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు పూర్తిగా అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్య స్థానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు–భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) సీఎం ప్రసంగించారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ను ప్రదర్శించారు.  

పెట్టుబడిదారులకు అందరి మద్దతు 
‘తెలంగాణకు గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పారీ్టలు, ప్రభుత్వాలకు సారథ్యం వహించాయి. అయితే.. పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్‌ ముఖ ద్వారం. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలిపేందుకే మా ప్రథమ ప్రాధాన్యత..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

చైనా ప్లస్‌ 1మోడల్‌కు గ్లోబల్‌ సమాధానంగా తెలంగాణ 
‘గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుంది. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్‌ రివర్‌ ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్‌ నైట్‌ ఎకానమీ కూడా కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. 

డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్, రేడియల్‌ రోడ్లు, ఓఆర్‌ఆర్‌–ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. చైనా ప్లస్‌1 మోడల్‌కు గ్లోబల్‌ సమాధానం తెలంగాణ అవుతుంది. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే.. తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్‌ సౌత్‌) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ఈ దిశగా ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు దృష్టి సారించాలి..’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

నగరంలో ప్రధాన రోడ్లకు టెక్‌ సంస్థల పేర్లు 
‘భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయి. హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని అనుకుంటున్నాం. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీల పేర్లను పెడతాం..’ అని సీఎం వెల్లడించారు. కాగా తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ వార్షిక సదస్సులో విశేష ఆదరణ లభించిందని సీఎంఓ పేర్కొంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరిస్తూ.. రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుందని తెలిపింది.  

రేవంత్‌ రెడ్డి విజన్‌ బోల్డ్, క్లియర్, అచీవబుల్‌ 
‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్‌ పారదర్శకంగా,సాహసోపేతంగా (బోల్డ్‌), సాధించగలిగేలా (అచీవబుల్‌) ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది..’ అని సిస్కో మాజీ సీఈఓ జాన్‌ ఛాంబర్స్‌ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement