మెట్రోపై సానుకూలం | CM Revanth Reddy and Kishan Reddy meet Ashwini Vaishnav | Sakshi
Sakshi News home page

మెట్రోపై సానుకూలం

Jun 23 2026 1:31 AM | Updated on Jun 23 2026 1:31 AM

CM Revanth Reddy and Kishan Reddy meet Ashwini Vaishnav

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ

మెట్రో ఫేజ్‌–2ను సంయుక్త వెంచర్‌గా చేపట్టాలని రేవంత్‌ వినతి  

మెట్రో తొలి దశకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి

సంయుక్త కమిటీ నియమిస్తే విస్తరణ వేగవంతమవుతుందన్న కేంద్ర మంత్రులు 

రెండు గంటలకుపైగా చర్చలు 

నేడు కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌తో సమావేశం

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా వీరితోపాటు చర్చలో పాల్గొన్నారు. ఢిల్లీలోని రైల్వేభవన్‌ వీరి సమావేశానికి వేదికైంది. వీరి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు సాగాయి. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) రుణంతోపాటు మెట్రో ఫేజ్‌–2 విస్తరణకు త్వరితగతిన అనుమతుల విషయమై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ఫేజ్‌–1కు కేంద్రం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఇప్పటివరకు రూ.1,204 కోట్లు ఇచ్చిందని ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌ చెప్పినట్లు తెలిసింది. ఫేజ్‌–2 విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనూ కేంద్రం సూచించిన రెండు ప్రత్యామ్నాయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా రూ.10వేల కోట్లు తక్కువ ఖర్చయ్యేలా సూచించిన ఆర్‌ఆర్‌టీఎస్‌ ఫార్ములాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనే విషయాన్ని కిషన్‌ రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విషయాన్ని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తే, తద్వారా సమన్వయ ప్రక్రియ ఆలస్యం లేకుండా మెట్రో విస్తరణ వేగవంతమవుతుందనే విషయాన్ని ఇద్దరు కేంద్ర మంత్రులూ రేవంత్‌రెడ్డితో అన్నట్లు తెలిసింది. 

మెట్రో ఫేజ్‌–2 50ః50 నిష్పత్తిలో.. 
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–1లో ఈక్విటీ షేర్‌ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15వేల కోట్ల లావాదేవీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ మేరకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం మంజూరు చేయడానికి ఒప్పందం కుదిరింది. అయితే, జూన్‌ 15న మొదటి విడత రుణం విడుదల కాలేదని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి అశ్వినీ వైష్ణవ్‌కు చెప్పారు. ఆ రుణం విడుదల చేయడంతోపాటు మెట్రో ఫేజ్‌–2ను 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేలా ఆమోదించాలని కోరారు. భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా సాగినట్లు చెప్పారు. మంగళవారం కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో సమావేశమైన తర్వాత, మెట్రో ప్రాజెక్టు సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఖట్టర్, రేవంత్‌ భేటీలో కిషన్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు.  

పరస్పర సవాళ్ల మధ్య భేటీ 
హైదరాబాద్‌ మెట్రో రైలు వ్యవహారం ముందుకెళ్లకుండా మోకాలడ్డుతున్నారంటూ కిషన్‌రెడ్డిపై కొన్నిరోజులుగా రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కిషన్‌రెడ్డి స్పందిస్తూ ఎన్నికల హామీల అమలులో తమ వైఫల్యంపై ప్రజల దృష్టి మళ్లించడానికే రేవంత్‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులివ్వొద్దని తాను ఏ మంత్రికి చెప్పానో నిరూపించగలరా? అని సవాలు కూడా విసిరారు. అయితే తాను రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, అప్పుడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రితో రేవంత్‌ రెడ్డి, కిషన్‌రెడ్డి సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement