సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని ఎన్టీయార్ గార్డెన్ వద్ద జరిపిన సంబరాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. అంతర్జాతీయ సైకత కళాకారుడు ఆకునూరు వరప్రసాద్.. హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.
అంతర్జాతీయ గుర్తింపు
ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడ గ్రామానికి చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్.. సైకత కళలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నాడు. పలు ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించాడు. 2022లో ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా సముద్ర తీరంలో జరిగిన అంతర్జాతీయ శిల్ప కళోత్సవంలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు.

2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది పోటీ పడగా మొదటి బహుమతి సాధించి సత్తా చాటాడు. తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటిదీపోత్సవంలోనూ తన కళ ప్రదర్శించాడు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరంలో తన శాండ్ ఆర్ట్‌తో ఆకట్టుకున్నాడు.
ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో..
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో OU JAC ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం రేవంత్‌కు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు.


