breaking news
Akunuru Balaji Varaprasad
-
సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు.. ఆకట్టుకున్న సైకత శిల్పం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని ఎన్టీయార్ గార్డెన్ వద్ద జరిపిన సంబరాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. అంతర్జాతీయ సైకత కళాకారుడు ఆకునూరు వరప్రసాద్.. హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.అంతర్జాతీయ గుర్తింపుఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడ గ్రామానికి చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్.. సైకత కళలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నాడు. పలు ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించాడు. 2022లో ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా సముద్ర తీరంలో జరిగిన అంతర్జాతీయ శిల్ప కళోత్సవంలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు.2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది పోటీ పడగా మొదటి బహుమతి సాధించి సత్తా చాటాడు. తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటిదీపోత్సవంలోనూ తన కళ ప్రదర్శించాడు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరంలో తన శాండ్ ఆర్ట్‌తో ఆకట్టుకున్నాడు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో..ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో OU JAC ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం రేవంత్‌కు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. -
అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం; ఏపీకి ఫస్ట్ ప్రైజ్
సాక్షి, కోణార్క్: అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ఏపీ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదుగా ఆయన.. పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగిన పోటీల్లో వైవిధ్యమైన ఇసుక శిల్పాలతో బాలాజీ వరప్రసాద్ అందరినీ ఆకట్టుకున్నారు. ఒడిశా టూరిజం- కల్చర్, హాకీ వరల్డ్‌కప్ - 2023, భారతీయ సంస్కృతి- పండుగలు, ప్రపంచ శాంతి ఇతివృత్తాలతో సైకత శిల్పాలను తయారు చేశారు. పోటీదారులందరి కంటే మిన్నగా అద్భుత శిల్పాలను తయారు చేసి మొదటి బహుమతి సాధించారు. కాగా, 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లోనూ ప్రథమ బహుమతి సాధించడం విశేషం. సంతోషంగా ఉంది: బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవంలో విజేతగా నిలవడం పట్ల బాలాజీ వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం తరపున భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) -
Akunuru Balaji Varaprasad: శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: ఇసుక రేణువులను మునివేళ్లతో తాకుతూ.. అద్భుత శిల్పాలు చెక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో జరుగుతున్న ‘అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొంటున్నాడు. చిత్రకళా పోటీల్లో చిన్ననాటి నుంచే అనేక బహుమతులు అందుకున్న బాలాజీ ఆ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ చదివే రోజుల్లో సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి ఇసుకతో ‘మత్స్య సుందరి’ పేరిట సైకత శిల్పాన్ని రూపొందించడం, అది పత్రికల్లో ప్రచురణ కావడంతో శాండ్ ఆర్ట్‌పైకి దృష్టి మరల్చాడు. ఎంతో సాధన చేసి సైకత శిల్పిగా, పోర్ర్‌టైట్ ఆర్టిస్ట్‌గా, స్పీడ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. సైకత కథలకు విశేష స్పందన భారతీయ ఇసుక శిల్పిగా, యానిమేషన్, కథకుడిగా బాలాజీ రూపొందించిన అనేక సైకత శిల్పాలు, సైకతరూపక కథలకు విశేష స్పందన లభిస్తోంది. వాటిని వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు వీక్షిస్తున్నారు. ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ అవార్డులు, 8 జాతీయ అవార్డులు, రెండు పురస్కారాలు (ఉగాది, విశిష్ట వ్యక్తి పురస్కారం), రెండు ప్రపంచ రికార్డులు (అద్భుత ప్రపంచం, మేధావి ప్రపంచ రికార్డులు) సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలపై 250కి పైగా ఇసుక శిల్పాలను చెక్కి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. (క్లిక్: పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!) ఇసుక రేణువులతో చైతన్యం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, పెయింటింగ్, కాన్వాసింగ్‌పై మక్కువతో అనేక ప్రయోగాలు చేశాను. సైకత శిల్పాల సృష్టిలోనూ పట్టు సాధించాను. ఎటువంటి సంగీతం, ఇతర పరికరాలు అవసరం లేకుండానే ఇసుక శిల్పాలతో ప్రజలకు అతి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో అంశాలను ప్రదర్శిస్తున్నాను. 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది సైకత శిల్పులు పాల్గొనగా.. అంతర్జాతీయ ప్రథమ బహుమతి సాధించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీల్లో కచ్చితంగా బహుమతి సాధించాలనే పట్టుదలతో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నాను. – ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సైకత శిల్పి


