కోవర్టు వ్యవహారం ముగియక ముందే మరో కలవరం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలంటూ వైరల్
కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిందనే వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్ పేరు ప్రస్తావన.. వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ
మహిళల పరువు తీసేలా ఎవరూ వ్యాఖ్యానాలు చేయకూడదన్న మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో పార్టీలోని కోవర్టుల వ్యవహారం ఇంకా ముగియక ముందే..పార్టీని, పీసీసీ అధ్యక్షుడిని ఉద్దేశించి షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న ఆ ఆడియో గాందీభవన్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన టీపీసీసీ షబ్బీర్ అలీని వివరణ కోరింది. ఢిల్లీ పెద్దలు సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఏముందా ఆడియోలో..
ఆవేదన, పరామర్శ కోణంలోనే ఆ ఆడియోలోని మాటలు ఉన్నప్పటికీ పార్టీలో చర్చనీయాంశమయ్యింది. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. తనకు కాకుండా ఎవరో చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తాను ఉరి పెట్టుకుంటానంటూ ఓ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేయగా, సదరు నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడుతున్నారని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారనే కోణంలో వ్యాఖ్యలు ఉండటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పేరు కూడా ఉచ్ఛరించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియో ఎప్పటిదో అయినా..అది కాస్తా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది.
నేనేంటో అందరికీ తెలుసు: మహేశ్‌గౌడ్
ఈ ఆడియో వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో దీనిపై ప్రశ్నించగా.. ఎలాంటి ఆరోపణల విషయంలోనైనా తొందరపడేది లేదని స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, నా పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజామాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. 40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి్పంచారు. ఎందుకు చేరి్పంచారో ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్‌రెడ్డి సిఫారసు చేసినందుకే చంద్రశేఖర్‌రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనిపై ఆయన్ను వివరణ కోరాం. ఈ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది..’ అని చెప్పారు.
పీసీపీ చీఫ్‌ను టార్గెట్ చేశారా?
పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పార్టీలోని కొందరు టార్గెట్ చేశారా? అనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ చర్చకు ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఓ చానెల్‌లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, సీఎం రేవంత్‌కు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడే ఇలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బలహీనపడ్డారా? లేదంటే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా..అన్నది అర్థం కావడం లేదని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి.
వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి
పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్టకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ కార్యకర్తతో మాట్లాడిన సంభాషణపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్‌చైర్మన్ అనంతుల శ్యాంమోహన్, సభ్యుడు జాఫర్ జావేద్‌లు శనివారం షబ్బీర్ అలీకి లేఖ రాశారు. వివరణపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని సూచించారు.


