ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్‌గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్‌ | CM KCR Comments On Congress Party | Sakshi
Sakshi News home page

ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్‌గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్‌

Jun 7 2023 12:56 AM | Updated on Jun 7 2023 7:19 AM

CM KCR Comments On Congress Party - Sakshi

మంగళవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రజలు, నేతలు బహూకరించిన నాగలితో ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రైతు పేరిట ఉన్న భూమి మార్చేందుకు ఇప్పుడు ఎమ్మార్వో, మంత్రి, చివరకు ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదని, ధరణితో కేవలం రైతు బొటన వేలికే భూముల రికార్డులు మార్చే అధికారం ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ధరణి తీసేస్తే రైతులు మళ్లీ పంట డబ్బుల కోసం చిట్టీలు పట్టుకుని సేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగానే రైతుబంధు కింద పెట్టుబడి సాయం, రైతు చనిపోతే రూ.5 లక్షలు, వడ్లు అమ్మితే పంట డబ్బులు వెంటనే అందుతున్నాయని తెలిపారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు. 

ధరణి లేకుంటే ఎన్ని పంచాయతీలయ్యేవో.. 
‘ప్రపంచంలో ఎక్కడినుంచైనా బటన్‌ నొక్కి రైతు తన పేరిట ఉన్న భూమిని చూసుకునే చక్కని సదుపాయం ధరణి కల్పించింది. ధరణి లేకుంటే కోట్ల రూపాయలు పలుకుతున్న భూములతో ఎన్ని పంచాయతీలు, పోలీసు కేసులు, మర్డర్లు అయ్యేవో ఆలోచించాలి. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలన్న కాంగ్రెస్‌ నేతలకు ఇదంతా ఇష్టం లేదు. అందువల్ల వారినే బంగాళాఖాతంలో పడేయాలి. కాంగ్రెస్‌ మాటలు విని రైతులు సాధికారతను కోల్పోవద్దు.

రైతుల మధ్య మళ్లీ భూ తగాదాలు పెరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలని కొందరు కుట్ర పన్నుతున్నారు. ధరణి తీసేస్తే వీఆర్వోలు, గిర్దావరీల చేతుల్లోకి మన బతుకులు వెళ్తాయి. మళ్లీ వాళ్లు రాసిందే రాత, గీసిందే గీతగా మారుతుంది. ఇప్పుడు అడుగుతున్నా ధరణి తీసేద్దామా? కాపాడుకుందామా? ధరణితో నూటికి 99 శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఏవైనా సమస్యలు మిగిలి ఉంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిషాల్లో పరిష్కారం చేస్తారు..’ అని కేసీఆర్‌ అన్నారు.  

మంది మాటలకు ఆగం కావొద్దు.. 
‘తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇందులో ఒకటిన్నర ఏళ్లు కరోనా, మరో ఏడాది నోట్ల రద్దుతోనే గడిచిపోయింది. అయినా మిగిలిన ఆరున్నర ఏళ్లలోనే దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. మంది మాటలు విని ఆగం కావొద్దు. కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులదే భోజ్యం. ఆ ప్రబుద్ధుల పాలనలో కంప చెట్లే దిక్కయ్యాయి. కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..’ అని సీఎం పేర్కొన్నారు.  

ఇకపై బంగారు తునకగా పాలమూరు.. 
‘ఉద్యమ సమయంలో నన్ను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిపిస్తామని పెద్దలు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అన్నారు. అప్పుడు పాలమూరులో ఉద్యమం అంతగా లేకున్నా ఎంపీగా గెలిపించారు. ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడి కష్టాలు అర్థమయ్యాయి. కల్వకుర్తి తండాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. దుందుభి వాగుపై గోరటి పాట రాస్తూ ‘వాగు ఎండిపోయెరా, చేను ఎండిపోయెరా..’ అని బాధపడ్డడు. నేను ఇక్కడి ఎంపీగా ఉండగానే రాష్ట్రం సాధించుకున్న చరిత్ర పాలమూరుకు ఉంది.

రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరును పంటల భూమిగా మార్చిన సంతోషం ఉంది. ‘వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా.. నేడు చెరువులన్నీ నిండి పన్నీటి జలకమాడే పాలమూరు’ అంటూ నేనే పాట రాసిన. నాగర్‌కర్నూల్‌ నుంచి శపథం చేస్తున్నా. నేను ఇప్పటివరకు ఏ పని చేసినా భగవంతుడు ఓడించలే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. నార్లాపూర్, ఏదుల, మిగతా అన్ని రిజర్వాయర్లను ఆగస్టులోనే నింపుతాం.  

నా బలగం, బంధువులు తెలంగాణ ప్రజలే.. 
దేశంలో ఎక్కడకు పోయినా తెలంగాణ మోడల్‌ గురించే అడుగుతున్నారని కేసీఆర్‌ చెప్పారు. తన బలగం, బంధువులు తెలంగాణ ప్రజలేనని, మీరిచ్చిన ధైర్యంతోనే దేశ రాజకీయాల్లోకి పోవాలన్న నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి,  శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

పాలమూరులో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు 
ఇకపై నా పాలమూరును బంగారు తునకగా చూడబోతున్నాం. రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. కానీ వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నాం. కులవృత్తుల కుటుంబాలకు ఈ నెల 9 నుంచి ఇంటికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement