సాక్షి, చైన్నె : సినీ నటుడు శరత్‌కుమార్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ బుజ్జగించారు. దీంతో ఆయన కాస్త శాంతించారు. అదే సమయంలో తమ డిమాండ్ల వినతి పత్రాన్ని నైనార్‌కు శరత్‌కుమార్ అందజేశారు. వివరాలు.. సినీ నటుడు శరత్‌కుమార్ తన సమత్తువ మక్కల్ కట్చిని బీజేపీలో లోక్ సభ ఎన్నికల సమయంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. తనకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తామని చెప్పి ఏడాదిన్నర కాలంగా పక్కన పెట్టడం శరత్‌కుమార్‌లో వేదనను కల్గించింది. దీంతో ఆదివారం తన మద్దతుదారురులతో సమావేశమై అసంతృప్తి, ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితులలో ఆయన్ని బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ రంగంలోకి దిగారు. కమలాలయంకు పిలిపించారు. తన మద్దతుదారులతో కలిసి నైనార్‌ను శరత్‌కుమార్ కలిశారు. నైనార్ ఇచ్చిన హామీ, బుజ్జగింపుతో శరత్‌కుమార్ కాస్త తగ్గారు. మరి కొంత కాలం వేచి చూసే ధోరణికి నిర్ణయించారు. అదే సమయంలో ఎన్నికలలో తన మద్దతుదారులకు సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో పాటూ పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని నైనార్‌కు అందజేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని నైనార్ హామీ ఇవ్వడం గమనార్హం.
ప్రత్యేక పర్యవేక్షకుడిగా ప్రతాప్ సింగ్
తమిళనాడు శాసనసభ సాధారణ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం) కీలక చర్యలు చేపట్టింది. భారత రాజ్యాంగంలోని తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి ప్రతాప్ సింగ్‌ను తమిళనాడు ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షకుడి ఎన్నికల కమిషన్ నియమిచింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది.
చైన్నెలోని అనెక్స్ బిల్డింగ్ అయకరా భవన్‌లో ఆయనకు కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయ ఫోన్ నంబర్: 044–28338378, మొబైల్ నంబర్: 7845321461 ప్రకటించారు. ఆయనకు లైసెన్ ఆఫీసర్‌గా జగన్ మోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా లేదా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు గమనించినా, వెలుగులోకి వచ్చినా పైన పేర్కొన్న ఫోన్ నంబర్లు లేదా ఈమెయిల్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షకుడిని నేరుగా సంప్రదించవచ్చని తమిళనాడు ఎస్‌ఈసీ అర్చనా పట్నాయక్ తెలియజేశారు.


