క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

51 ఏళ్ల వయసులో వైద్య సీటు..!

సాక్షి, చైన్నె: తమిళనాడులోని నాగపట్నం వేలంకన్ని సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సురేష్‌ కుమార్‌ (51) అనే వ్యక్తి ఫార్మాస్యూటికల్‌ రంగానికి చెందిన డయాగ్నస్టిక్‌ సంస్థలో వైస్‌ ప్రెసిడెంట్‌గా రూ.లక్షల జీతం పొందే ఉన్నత పదవిలో ఉన్నారు. ఆయనకు 1992లోనే డాక్టర్‌ కావాలనే కోరిక ఉన్నప్పటికీ అప్పట్లో సాధ్యపడలేదు. 2020లో నీట్‌ రాయడానికి వయోపరిమితి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో, ఆయన మళ్లీ పుస్తకం పట్టారు. రేయింబవళ్లు కష్టపడి నీట్‌ అర్హత సాధించారు. కౌన్సెలింగ్‌లో ఆయనకు నాగపట్టణం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు లభించింది. తన చివరి శ్వాస వరకు గ్రామాల్లోని పేద ప్రజలకు వైద్యసేవ అందించడానికే రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆయన భార్య (దుర్గ), పిల్లల మద్దతుతో తన 51వ ఏట ఈ ఘనత సాధించారు. చైన్నెలో చేపట్టిన ఎంబీబీఎస్‌ వైద్య కౌన్సెలింగ్‌ ద్వారా ఈ సీటు ఆయనకు దక్కింది.

బాలుడి శ్వాసనాళంలో పెన్ను మూత

– విజయవంతగా తొలగించిన వైద్యులు

అన్నానగర్‌: చిదంబరం అన్నా మలై నగర్‌ లోని కడలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికత్స చేశారు. ఓ బాలుడి శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన పెన్ను మూతను వైద్యులు విజయవంతంగా తొలగించారు. బాలుడిని ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడు తీవ్రమైన ఆయాసం, స్ట్రైడర్‌ (గాలి పీల్చేటప్పుడు శబ్దం), వీజింగ్‌ వంటి లక్షణాలతో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. సీటీ స్కాన్‌న్‌లో,పెన్ను మూత కుడి ప్రధాన శ్వాసనాళంలో ఇరుక్కుపోయి, ఊపిరితిత్తుల దిగువ భాగంలోకి లోతుగా చొచ్చుకుపోయినట్లు తెలిసిందన్నారు. అనంతరం ప్రొఫెసర్‌ షణ్ముగం నేతృత్వం లోని డాక్టర్‌ బాలాజీ స్వామినాథన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంతోష్‌ మాధవన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీయార్‌ డాక్టర్‌ సీతారామన్‌నేతృత్వంలో బాలుడి ముక్కులోంచి పెన్ను మూతను విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్సను నిర్వహించిన వైద్య బృందానికి పలువురు అభినందనలు తెలిపారు.

9 మంది మత్స్యకారుల అరెస్ట్‌

– సింహళ నావికాదళ దురాగతం

అన్నానగర్‌: తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులను సింహళ నౌకాదళం శుక్రవారం అరెస్టు చేసింది. రామేశ్వరం నుంచి మోటారు పడవలో సముద్రం మధ్యలో చేపలు పడుతున్న మత్స్యకారులను, రెండు గస్తీ పడవల్లో అక్కడికి చేరుకున్న సింహళ నౌకాదళం అదుపులోకి తీసుకుంది. గురువారం రాత్రి, రామేశ్వరం నుంచి 400లకు పైగా పడవల్లో 2వేల మందికి పైగా మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లారు. వాటిలో ఒకదానిలో, 9 మంది జాలర్లు మోటారు పడవలో మన్నార్‌ సమీపంలో చేపలు పడుతుండగా సింహళ నావికాదళం అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత, వారు సరిహద్దు దాటి వచ్చి, తమిళనాడు జాలర్లను పట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాలర్లను మన్నార్‌ నావికా స్థావరానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు మత్స్యకారులను వీలైనంత త్వరగా విడుదల చేయించాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సర్వర్‌ పనిచేయక..

రేషన్‌ ఇక్కట్లు

కొరుక్కుపేట: సర్కర్‌ పనిచేయకపోవడంతో తమిళనాడు వ్యాప్తంగా 30 వేలకు పైగా రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి రేషన్‌ దుకాణాల్లోని సర్వర్‌ సరిగ్గా పనిచేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తాంబరంలో సర్వర్‌ గంటల పాటు పని చేయక పోవడంతో క్రోమ్‌పేట్‌, చిట్లపాక్కం, పల్లవరం, చెంబాక్కం, సాలెయూర్‌, ప్రాగ్కన్కరై, పెరుంగలత్తూరు సమీప ప్రాంతాలలో సరుకుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల ప్రజలు వెనుదిరగాల్సి వచ్చింది. రేషన్‌ పంపిణీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తుండగా సర్వర్‌లో సమస్య తలెత్తిందని, ఈ మేరకు పరిష్కరించామని అధికారులు తెలిపారు.

కోవైలో కంపించిన

3 అంతస్తుల భవనం

సాక్షి, చైన్నె : తమిళనాడు కోయంబత్తూర్‌ ఆర్‌ఎస్‌ పురం వెస్ట్‌ సంబంధమ్‌ రోడ్డులోని ఓ 3 అంతస్తుల భవనంలో అశ్విన్‌ అనే వ్యక్తికి చెందిన స్వర్ణకారుల వర్క్‌షాప్‌ నడుస్తోంది. ఇక్కడ 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో భవనంలో స్వల్పంగా కంపించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు భవనంలో బంగారు ఆభరణాల తయారీ పని చేస్తున్న 200 మంది కార్మికులను సురక్షితంగా బయటకు పంపించారు. అనంతరం కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అక్కడికి చేరుకుని భవనం ధృఢత్వాన్ని పరిశీలించారు. దీనిపై కార్పొరేషన్‌ అధికారులు మాట్లాడుతూ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత తదపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement