పులకించిన శ్రీవిళ్లిపుత్తూరు | - | Sakshi
Sakshi News home page

పులకించిన శ్రీవిళ్లిపుత్తూరు

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

● వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి రథోత్సవం ● కనుల పండువగా ఆడి పూరం ఉత్సవాలు

శ్రీవిళ్లిపుత్తూరు ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో ఆడిపూరం బ్రహ్మోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రముఖంగా భావించే రథోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం జరిపించారు. ఆండాళ్‌ అమ్మవారు, రంగ నాథ స్వామి వారు రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు.

సాక్షి, చైన్నె : విరుదునగర్‌ జిల్లా రాజపాళయం సమీపంలోని శ్రీవిళ్లిపుత్తూరుకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఇక్కడి ఆండాళ్‌ అమ్మవారి ఆలయ రాజగోపురం రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా ఉంది. ఈ ఆలయంలో కొలువు దీరిని అమ్మ వారి జీవిత ఇతి వృత్తానికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వైష్ణవ పురాణం మేరకు మహా విష్ణువు దశ అవతారాలలో రంగనాథ స్వామిగా కొలువైన విషయం తెలిసిందే. మహావిష్ణు భక్తురాలిగా జన్మించిన ఆండాళ్‌ అమ్మ వారు రంగనాథ స్వామి వారిని మనువాడేందుకు ప్రార్థనలు చేసిన క్షేత్రంగా శ్రీవిళ్లిపుత్తూరు బాసిల్లుతోంది. అందుకే శ్రీమన్నారాయణుడు వెలిసిన 108 దివ్య క్షేత్రాల్లో శ్రీవిళ్లి పుత్తూరు ప్రత్యేక స్థానం కల్పించారు. శ్రీకృష్ణుడి మీద అనేక పాటలు రచించిన ఆళ్వార్లలో ముఖ్యుడిగా పేరు పొందిన పెరియాళ్వార్‌ అనే విష్ణు సిద్ధర్‌కు కుమార్తెగా అవతరించిన ఆండాళ్‌ అమ్మవారి పుణ్యక్షేత్రమే ఇది. అందుకే ఇక్కడ ఉత్సవాల సమయంలో గోవిందా...గోపాలా అనే భక్తి నినాదం మార్మోగుతూ ఉంటుంది.

ఆడి నెలలో బ్రహ్మోత్సవాలు

శ్రీవిళ్లిపుత్తూరులో ఏటా ఆడి ఉత్సవం, ఆడిపూరం రథోత్సవం, పెరటాసి నెలలో శనివార ఉత్సవం, పెరుమాల్‌ ఉత్సవం, మార్గశిర, మాఘ మాసం, పంగుణి మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదిలో తొలి ఉత్సవంగా ఆడి నెలలో బ్రహ్మోత్సవాలు జరిపిస్తుంటారు. ఆ మేరకు శ్రీవిళ్లిపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయ ఆడిపూర మహోత్సవం ఈనెల 6వ తేదీ నుంచి సాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజు నుంచి కనువిందుగా బ్రహ్మోత్సం జరుగుతోంది.. గోవర్ధన గిరి కృష్ణుడి అలంకారం, పెరియాళ్వార్‌ మంగళా శాసనం , గరుడ సేవ, శయన సేవలు అత్యంత వేడుకగా జరిగాయి. గురువారం రాత్రి రంగమన్నార్‌ బంగారు గురప్రు వాహనంపై, ఆండాళ్‌ పుష్ప పల్లకీపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఆండాళ్‌, రంగమన్నార్‌(రంగనాథస్వామి)కు వేడుకగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సర్వాలంకార భూషితులై ఆడి పూర రథంపైకి వేంచేశారు. ఆ సమయంలో శ్రీరంగం రంగనాథస్వామి, మదురై అళగర్‌ కోవెల సుందరరాజ పెరుమాళ్‌ ఆలయాల నుంచి పంపిన పట్టు వస్త్రాలు మంగళ ద్రవ్యాలను దేవదేవేరులకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడి పూర ఉత్సవాల్లో భాగంగా ఉదయం 8:45 గంటలకు రథోత్సవంప్రారంభమైంది. ‘గోవిందా... గోపాలా...’ నినాదాల మధ్య వేలాది మంది భక్తులు తాళ్లు పట్టి నాలుగు వీధుల గుండా రథాన్ని లాగారు. 196 అడుగుల ఎత్తు ఉన్న శ్రీవిళ్లి పుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయ రాజగోపురం ఓ వైపు, 112 అడుగుల ఎత్తు కలిగి, మహాభారత, రామాయణ శిల్పాలతో నిండిన ఈ ఆడి పూర రథం మరో వైపు భక్తులను కట్టిపడేశాయి. తమిళనాడులోనే రెండవ అతిపెద్ద రథంగా ఆండాళ్‌ అవతరించిన ఆడి (శ్రావణ) మాస పుర నక్షత్రంలో ఈ రథోత్సవం వైభవంగా చేపట్టడం విశేషం. మంత్రి జగదీశ్వరి, కలెక్టర్‌ సుగపుత్ర తాడు పట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. కీళ రథ వీధిలో (తూర్పు రథ వీధి) గుమిగూడిన వేలాది మంది భక్తులు గోవిందా... గోపాలా... అని స్మరిస్తూ రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కార్తి, సెల్వం, సబ్‌ కలెక్టర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌, దేవదాయ శాఖ సహాయ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆడి మాసంలో చివరి శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిట కిటలాడాయి. ఇళ్లలో మహిళలు వత్రాలు, నోములలో నిమగ్నమయ్యారు. అనేక ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలలకు పాల బిందెల ఊరేగింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement