సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
పేరెంట్స్ విడాకులు
శరత్‌కుమార్, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్‌కుమార్ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది.
ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పు
అయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.

మళ్లీ పెళ్లి చేయాలని..
అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఎవరినీ దగ్గరకు రానివ్వను
ఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్‌మెంట్ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది.
శరత్‌కుమార్ రెండో పెళ్లి
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్‌రౌండర్‌గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్‌కుమార్, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్ సంతానం.
చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి


