త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది! | Chinmayi Sripaada Afraid to admit she Dubbed for Trisha Krishnan in Karuppu Movie | Sakshi
Sakshi News home page

నిజంగా భయపడ్డా.. ఆరోజు వెక్కివెక్కి ఏడ్చా..: చిన్మయి శ్రీపాద

May 17 2026 11:06 AM | Updated on May 17 2026 11:28 AM

Chinmayi Sripaada Afraid to admit she Dubbed for Trisha Krishnan in Karuppu Movie

చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్‌ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేసింది.

నిజంగా భయపడ్డా..
'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. 

వెక్కివెక్కి ఏడ్చా..
గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్‌ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్‌కు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.

థాంక్యూ బాలాజీ
ఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్‌ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్‌ జత చేసింది చిన్మయి.

చిన్మయిపై బ్యాన్‌
2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్‌ ఉన్నప్పటికీ లోకేశ్‌ కగనరాజ్‌ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్‌ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్‌ చెప్పింది.

 

 

చదవండి: విజయ్‌- త్రిషలపై చీప్‌ ప్రశ్న.. రాజాసాబ్‌ బ్యూటీ ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement