సూర్యాపేటటౌన్ : పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో సాధన ప్రారంభించాలని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా యంత్రాంగం సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మొద్దని హెచ్చరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు.
వీ బీజీ రామ్‌జీ పనుల నిర్వహణపై ఆరా
మోతె: మండల కేంద్రంతోపాటు హుస్సేన్‌బాద్ గ్రామాన్ని డీఆర్‌డీఓ సన్యాసయ్య గురువారం సందర్శించారు. మోతెలో వీ బీజీ రామ్‌జీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి హాజరు పట్టిక, రికార్డులు తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న వీ బీజీ రామ్‌జీ పథకం పనుల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు సరైన పద్ధతిలో రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని కూలీలకు సూచించారు. అనంతరం మోతె నర్సరీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ సందీప్‌కుమార్, ఈసీ శ్రీహరి, టీఏలు ఉన్నారు.
మజ్దూర్ యూనియన్
రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాస్
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సుంకరి శ్రీనివాస్ నియామకమయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో డీఎం సునీతకు తన నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారులు విప్లవ రెడ్డి, చెరుకు వెంకటయ్య, డిపో అధ్యక్షుడు భాను, కార్యదర్శి మాచర్ల భాస్కర్, నాయకులు ఘని, అనిల్‌కుమార్, వీరయ్య, జానయ్య, ఎంఆర్ స్వామి సైదులు, డీఎస్ రావు, రవి, మహిళా సెక్రెటరీ నేతి సావిత్రి, లక్ష్మీ, సునీత పాల్గొన్నారు.
చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
సూర్యాపేట అర్బన్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లగుండ్ల శిరోమణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్‌లో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మట్లాడారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు అన్ని పాలకవర్గ పార్టీలు మనువాదాన్ని బలపరుస్తూ, మహిళలను రెండవ శ్రేణి పౌరులుగానే గుర్తిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి ఒంటికొమ్ము సంతోషిమాత, కోశాధికారి మోటకట్ల జయమ్మ, సభ్యులు ఐతరాజు పద్మ, కట్టా కల్పన పాల్గొన్నారు.


