క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి కొందరు అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ ల్యాబ్‌లు, పడకలు ఏర్పాటు చేసి అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తిరుమలగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆసుపత్రిని సీజ్ చేశారు. అధికారుల తనిఖీల్లో విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఆస్పత్రిలోనే ఆల్ట్రా సౌండ్ మిషన్, ఇతర పరికరాలను సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సదరు దవాఖాన అనుమతి కూడా ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తునట్లు తేలింది. అర్హత లేకుండానే వైద్యం అందిస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధం అయినప్పటికీ డబ్బులకు ఆశపడి కొద్ది మంది ఈ ప్రాంతంలో పరీక్షలు చేసి జనగామ, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అబార్షన్లు చేపిస్తున్నారని సమాచారం. వారం రోజుల క్రితమే జనగామ జిల్లాలో ఓ మహిళకు గర్భస్రావం చేస్తుండగా తల్లి మరణించిన ఘటన వెలుగు చూసింది.
నామ మాత్రంగా తనిఖీలు
పట్టణాలతో పాటు మండల కేంద్రాలలో ఇలాంటి ఆస్పత్రులు వెలుస్తున్నా వైద్యశాఖ అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స చేసేందుకు అనుమతి తీసుకొని ఆస్పత్రిలోనే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొంత కాలం పని చేసిన వ్యక్తులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లుగా అవతారం ఎత్తుతున్నారు. అరకొర వైద్యం అందిస్తూ ప్రాణాల మీదికి వస్తే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా వైద్యశాలను ఏర్పాటు చేయకూడదు.
– వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
ఫ తిరుమలగిరిలో ప్రైవేటు ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
ఫ చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ
ఫ తనిఖీలు లేక యథేచ్ఛగా నిర్వహణ


