తిరుమలగిరి (తుంగతుర్తి) : నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తిరుమలగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిని జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ హాస్పిటల్‌లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో గురువారం వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈమేరకు ఆల్ట్రా సౌండ్ మిషన్‌తో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించి, ఆస్పత్రిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పీసీపీఎన్‌డీటీ పీఓ డాక్టర్ నజియా తబస్సుమ్ తెలిపారు. ఆమె వెంట ఎస్‌ఓ ఎంఏ బాసిత్, డిప్యూటీ డీఈఎంఓ సంజీవరెడ్డి, ఏఎస్‌ఓ మత్స్యగిరి, శర్మ, ఉపేందర్, శంకర్, రామచంద్రు తదితరులున్నారు.
ఆస్పత్రి పరిశీలన
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ హెచ్చరించారు. గురువారం తిరుమలగిరిలో సీజ్ చేసిన ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డాక్టర్ నజియా తబస్సుమ్, ఎస్‌ఓ ఎంఏ బాసిత్, డిప్యూటీ డీఈఎంఓ సంజీవరెడ్డి, ఏఎస్‌ఓ మత్స్యగిరి, శర్మ, ఉపేందర్, శంకర్ వెద్య సిబ్బంది ఉన్నారు.


