● 14 రోజుల వ్యవధిలో రెండోసారి ప్రమాదం
● అధికారులు నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఇబ్బందులు
● లైదాం రైల్వే గేటు మధ్య నిలిచిన గూడ్స్ రైలు
జి.సిగడాం: పొందూరు రైల్వే స్టేషన్‌లో మరోసారి విద్యుత్ హైటెన్షన్ వైర్లు ట్రాక్‌పై తెగిపడ్డాయి. 14 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడడంతో రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 1వ తేదీన హైటెన్షన్ వైర్లు ట్రాక్‌పై పడడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ట్రాక్ లో ట్రైన్ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా విద్యుత్ వైర్లు తెగిపడడంతో మూడు గంటల పాటు ఆమదాలవలస, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. స్థానిక రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది మరమ్మతులు నిర్వహించి రాకపోకలు పునరుద్ధరించారు.
గేటు మధ్యలో నిలిచిన గూడ్స్ రైలు
వైర్లు తెగి పడడంతో లైదాం రైల్వే గేటు సమీపంలో మధ్యాహ్నం 2.30కు గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పొందూరు, సంతకవిటి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే గేటు ఇరువైపులా వాహనాలు బారులు తీరి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వాహనహదారులు పెందుర్తి అండర్ పాస్ మీదుగా రాకపోకలు సాగించారు. తీగలు తెగి పడిన విషయాన్ని విశాఖపట్నంలోని ఉన్నతాధికారులకు స్థానిక సూపరింటెండెంట్ సమాచారం ఇవ్వడంతో టవర్ వ్యాగన్ ఓహెచ్ ఈ కారుతో పొందూరు చేరుకుని సాంకేతిక సిబ్బందితో మరమ్మతులు చేయించారు.


