● ఆక్రమణలకు
గురవుతున్న
నారాయణపురం కాలువ
● యథేచ్ఛగా సాగు చేసుకుంటున్న పలువురు
● పట్టించుకోని
అధికారులు
చర్యలు తీసుకుంటాం
నారాయణపురం ఎడమ ప్రధాన కాలువ ఆక్రమణకు గురైన విషయం వాస్తవమే. అందువలన త్వరితగతిన ఆక్రమణలు తొలగించే చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటాం.
– వై.రవీంద్ర, డీఈ, నీటి పారుదల శాఖ
ఆమదాలవలస రూరల్:
రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలవాల్సిన నారాయణపురం ఎడమ కాలువకు ఇరువైపులా గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. నాగావళి నది ద్వారా నారాయణపురం నుంచి కళ్లేపల్లి వరకు సుమారు నాలుగు పంటలకు సంబంధించి లక్షల ఎకరాలకు ఇదే కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. అయితే నారాయణపురం ఎడమ ప్రధాన కాలువకు ఇరువైపులా ఉండే గట్టు కబ్బాచేసి కొంతమంది ఆక్రమణదారులు సాగు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణపురం కుడి, ఎడమ కాలువ లకు సంబంధించి ఇరువైపులా రహదారి నిర్మాణం కోసం 2014లో జైకా నిధులు రూ.47 కోట్లతో అప్పటి టీడీపీ ప్రభుత్వం అంచనాలు వేసింది. అయితే సకాలంలో నిధులు మంజూరవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కానీ కాలువకు ఇరువైపులా చదును చేసిన స్థలంలో కొందరు ఆక్రమణదారులు అరటి, ఉలవ, మొక్కజొన్న, కంది తదితర పంటలు పండించుకుంటున్నారు. బూర్జ మండలంలోని నారాయణపురం నుంచి శ్రీకాకుళం రూరల్ మండలంలోని కళ్లేపల్లి వరకు కాలువకు ఇరువైపు లా రహదారి నిర్మాణం చేసేందుకు చదును చేశారు. రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో ఆక్రమణదారులు పలు పంటలు పండించుకొని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు.
కుచించుకుపోతున్న కాలువ
పలువురి ఆక్రమణలతో ప్రధాన కాలువ కుచించుకుపోతోంది. దీనివల్ల దిగువ ప్రాంత రైతులకు నీరందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కాలువకు ఇరువైపులా ఆక్రమణ చేసి పలు పంటలు వేయగా, మరికొందరు కాలువ గట్టును తమ పంట పొలాల్లో కలుపుకొని దురాక్రమణకు పాల్పడుతున్నారు. దీనివల్ల రైతులు పండించే పంట పొలాలకు విత్తనాలు, ఎరువులు తరలించేందుకు సైతం అవకాశం లేకుండాపోతోంది. వాస్తవంగా రైతులు తమ పంట పొలా లకు ఎరువులు, విత్తనాలు కాలువ గట్టు నుంచి తరలిస్తారు. అయితే కాలువ గట్లు పూర్తిగా ఆక్రమణకు గురవ్వడమే కాకుండా, ఆక్రమణదారులు పలు పంటలు వేయడంతో కాలువ గట్టుపై నడిచే అవకాశం లేకుండా పోయింది. దీంతో పంట పొలాల నుంచే విత్తనాలు, ఎరువులు తరలించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అందువలన ఇప్పటికై నా నీటిపారుదల శాఖ అధికారులు కాలువ గట్టు ఆక్రమణలు తొల గించి ప్రభుత్వ భూములు కాపాడడమే కాకుండా.. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


