కుత్బుల్లాపూర్: తాగిన మైకంలో గొడవ పడి తలపై కర్రతో కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరి నరసింహులు గత 6 నెలలుగా కొంపల్లి పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కింద ఉంటూ అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు కన్నా అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఇద్దరూ కలిసి ఒకే చోట నిద్రపోతూ.. ఉద యం కూలి పనులకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. నరసింహులు తలపై, కాళ్ల పైన కర్రతో కన్నా కొట్టి తీవ్రంగా గాయపరచడంతో అతడు కింద పడిపోయాడు. అతని పక్కనే తాగిన మైకంలో ఉన్న కన్నా సైతం నిద్రపోయి తెల్లవారుజామున పరారయ్యాడని పోలీ సులు తెలిపారు. మృతుని జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా చనిపోయిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన నరసింహులు అని తేలింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


