ఆపేదెవరు..? | - | Sakshi
Sakshi News home page

ఆపేదెవరు..?

Jul 16 2026 5:42 AM | Updated on Jul 16 2026 5:42 AM

● యథేచ్ఛగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు

● రూపం కోల్పోతున్న చెరువులు, కొండలు

● చోద్యం చూస్తున్న అధికారులు

అక్రమ

తవ్వకాలను..

వజ్రపుకొత్తూరు:

కాదేదీ తవ్వకాలకు అనర్హం.. అన్న రీతిలో కూటమి ప్రభుత్వంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారం అండతో చెరువులు, కొండలను చెరబడుతున్నారు. మట్టి, గ్రావెల్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేస్తూ జేబులు నింపుకొంటున్నారు. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లో తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతుండటంతో కొండలు, చెరువులు రూపు కోల్పోయి ప్రమాదకరంగా మారుతున్నాయి.

రాత్రీ పగలు తేడాలేకుండా..

వజ్రపుకొత్తూరు మండలం బెండికొండ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉంది. సర్వే నంబరు–1లో నిత్యం గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం ఉండటం లేదు.

నందిగాం మండలం కవిటి అగ్రహారానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తన వద్ద ఉన్న యంత్రాలతో గ్రావెల్‌ తరలించి దాదాపు 1.80 ఎకరాలు మేర చదును చేసి జీడి, ఇతర పండ్ల మొక్కలు నాటినా ఎవరూ స్పందించడం లేదు. ఇతనికి జిల్లా మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

తాడివాడ కొండ, ఉండ్రుకుడియా, అనంతగిరి కొండలు ఇప్పటికే సగం మేర కరిగిపోయాయి.

మందస మండలంలోని గోపాలసాగరం సుందరీకరణ పేరుతో ఓ టీడీపీ యువ నాయకుడు పెద్ద ఎత్తున మట్టి తరలించి అక్రమాలకు పాల్పడ్డాడు.

ఆర్‌కేపురం పరిధిలోని చెరువుల్లోనూ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొండలోగాం, చాపరాయి కొండల్లో అక్రమ గ్రానైట్‌ మైనింగ్‌ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నా ఆపే వారే కరువయ్యారు.

వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి పెద్ద చెరువు, లింగాలపాడు చెరువు, ఉద్దానం గోపినాథపురం కంబగాయ చెరువు, పలాస– కాశీబుగ్గలో నెమలి కొండ, గోపాలపురం, గరుడకండి వద్ద చెరువుల్లో జేసీబీలు, ప్రొక్లెయినర్స్‌తో మట్టి తవ్వకాలు చేపట్టి లోడు రూ.1000 వరకు అమ్ముకుంటున్నారు. దాదాపు 10 నుంచి15 అడుగుల లోతులో గోతులు తవ్వుతున్నందున అవి బావులను తలపిస్తూ అటుగా వెళ్లే చిన్నారులు, వృద్ధులకు మరణశాసనం రాస్తున్నాయి. వర్షాకాలంలో తప్ప ఈ గోతుల్లో నీరు నిలవకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

సహజ వనరులు కాపాడుకోవాలి..

ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకోవాలి. కొండలు, చెరువుల పర్యావరణానికి చాలా అవసరం. సునామీ, తుఫాన్ల వంటి విపత్తుల సమయంలో చెట్లు, కొండలు ఉంటే గాలి పీడన దిశ మారి ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. – బి.గోపాల్‌, గ్రీన్‌ ఆర్మీ అధ్యక్షుడు, పలాస

చర్యలు తప్పవు..

అనుమతులు లేకుండా కొండలు, చెరువులను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం ఎక్కడైనా చెరువులు, కొండలను తవ్వి మట్టి, గ్రావెల్‌ తరలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. – బి.సీతారామయ్య,

తహసీల్దార్‌, వజ్రపుకొత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement