శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ ట్రైల్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. విచారణ దశలో ఉన్న ఖైదీల కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ట్రయల్ ఖైదీలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదులను నియమించి ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం నివారించేందుకు సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు చొరవ తీసుకోవాలన్నారు. చిన్న నేరాలకు ఎక్కువ కాలం జైలులో ఉన్న వారి బెయిల్ దరఖాస్తులను సానుభూతితో పరిశీలించాలన్నారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి వై.బెన్నయ్య నాయుడు, రెండవ అదనపు జిల్లా జడ్జి బి.సాధుబాబు, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆర్.శాంతి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, జిల్లా ప్రభుత్వ న్యాయవాది, ఏఎస్‌పీ పి.శ్రీనివాసరావు, డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


