పలాస: ఉద్దానం ప్రాంతంలోని కార్గోఎయిర్ పోర్టు కు వ్యతిరేకంగా వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ముందుగా ప్రజాసంఘాల నాయకులను గృహ నిర్బంధం చేశారు. దీనిని నిరసిస్తూ బిడిమి, రాంపురం, భేతాళపురం, గంగువాడ, ఒంకులూరు తదితర 18 గ్రామాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి ప్రతినిధులు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓకు ఇవ్వాల్సిన వినతిపత్రాన్ని కాశీబుగ్గలోని మహాత్మాగాంధీ విగ్రహానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల ఆధారిత పరిశ్రమలు కాకుండా ఎవరి ప్రయోజనాల కోసం కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తున్నారో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సమాధానం చెప్పాలన్నారు. నిరసన కార్యక్రమంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జోటి అప్పారావు, వామపక్ష నాయకులు పి.నాగేశ్వరరావు, సి.హెచ్ రవి, బి.కూర్మారావు, ఎం.వినోద్‌కుమార్, బత్తిన లక్ష్మణరావు, గుంటు లోకనాథం, లండ రామ స్వామి, పొట్టి ధర్మారావు, ఎన్.పరుశురాం, జోగి శ్రీదేవి, ఎల్.సంధ్య, రామారావు పాల్గొన్నారు.


