● పాఠశాలను పరిశీలించిన డిప్యూటీ డీఈవో విలియమ్స్
సోంపేట: స్థానిక బాలికోన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ డీఈవో విలియమ్స్ బుధవారం పాఠశాలను పరిశీలించి విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, వైద్య సిబ్బందితో మాట్లాడారు. అధికారులతో పాఠశాల ఎస్‌ఎంిసీ చైర్మన్ సురేష్, సభ్యుడు నారాయణ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురైతే పాఠశాల హెచ్‌ఎం కనీసం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నోటుబుక్స్ అందజేయలేదని ఫిర్యాదు చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోవడంతో సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. నాసిరకం సరుకులు, భోజనంపై ప్రత్యేక దృష్టిలేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. హెచ్‌ఎంను మార్చాలని, లేదంటే విద్యార్థుల టీసీలు ఇచ్చేయాలని కోరారు. జెడ్పీటీసీ తడక యశోద మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా అందజేయడం దారుణమన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కలెక్టర్‌కు పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని విలియమ్స్ తెలిపారు. పరిశీలనలో డీఈవో కార్యాలయం ఏడీ శ్రీనివాసరావు, విద్యాశాఖాధికారులు ఎస్.జోరాడు, కృష్ణంరాజు, పలాసపురం సర్పంచ్ తడక జోగారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్
సోంపేట బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పాంజలిని సస్పెండ్ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు అందాయని మండల విద్యాశాఖాధికారి ఎస్.జొరాడు తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు బుధవారం పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు పాఠశాలలో విచారణ జరిపి ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


