కాశీకి తుల్యమైన క్షేత్రంగా ఖ్యాతి.. కృతయుగం నుంచి పూజలు అందుకుంటున్న ఆనవాళ్లు.. అనన్య సామాన్యమైన శిల్ప కళ.. శ్రీముఖలింగం సొంతం. కానీ ఇంతటి ఘన చరిత్రను కాపాడుకోలేకపోతున్నాం. ఆలయంలోని నిర్మాణాలు నానాటికీ కళావిహీనమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక, నిర్వహణ లోపాలతో ఈ అరుదైన క్షేత్రం తన వాస్తవ రూపాన్ని కోల్పోతోంది.
శ్రీముఖలింగ క్షేత్రంలో నిర్వహణ లోపాలు
అరుదైన శిల్ప సంపదకు అపాయం
దృష్టి సారించాలని భక్తుల విన్నపం
జలుమూరు:
ముఖలింగేశ్వరుడి క్షేత్రం సమస్యలను ఎదుర్కొంటోంది. సరైన ఆలనాపాలనా లేకపోవడంతో పురాతన విగ్రహాలు, శివలింగాలు పాడైపోతున్నాయి. చోళుల కాలం 8 వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ,విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు నిత్యం ఇక్కడకు వ స్తుంటారు. కార్తీక మాసం, శివరాత్రి ఉత్స వాలకు దేశం నలుమూలలు నుంచి సుమారు మూడు లక్షల మంది వరకూ భక్తులు స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తుంటారు. కానీ నిర్వహణ లోపంతో ఆలయ విశిష్టత దెబ్బ తింటోంది.
ప్రధాన సమస్యలు
వర్షాలు పడినప్పుడు గర్భగుడి లోపల కారిపోతోంది.
గర్భగుడి లోపల మధుకేశ్వరుని పానపట్టం గోతులుగా మారి పూజాది ద్రవ్యాలు, పంచామృతాలు నిల్వ ఉండి పోతున్నాయి.
ప్రధాన ఆలయం గర్భ గుడిలో ఫ్లోరింగ్ బీటలు వారి పూజా సామగ్రి నిల్వ వల్ల దుర్వాసన వస్తోంది.
ప్రధాన ఆలయంలో నిత్యాభిషేకాలు జరిగేటప్పుడు ఆ నీరంతా బయటకు వెళ్లి వంశధారలో కలిసేలా అనుసంధానం చేశారు. కానీ నిర్వహణ లోపంతా నీరు అక్కడే ఉండిపోయి దుర్గంధం వస్తోంది.
అష్ట దిక్పాలకులైన ఇంద్రేశ్వరుడు, వాయువేశ్వరుడు, అగ్నీశ్వరుడు, వరుణేశ్వరుడు, నైరుతేశ్వరుడు, యమేశ్వరుడు, కుబేరశ్వరుడు, ఈశానేశ్వరుడు వంటి శివలింగాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.
కుబేరుడు మినహా అన్ని శివలింగాల పానపట్టాలు శిథిలమైపోయాయి. అభిషేక, పూజా ద్రవ్యాలు అక్కడే నిల్వ ఉండిపోతున్నాయి.
ఆలయం అభివృద్ధి చేయాలి
ఏటా మేం ఇక్కడకు వస్తాం. భక్తులు, యాత్రికులు ఉండేందు కు కనీస సదుపాయాలు లేవు.
– వి.కిశోర్, భక్తుడు, పర్లాఖిముండీ
దుర్గంధం వస్తోంది
గర్భగుడిలో దుర్గంధం వస్తోంది. దేవదాయ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అభిషేక ద్రవాలు బయటకు వెళ్లే మార్గం చూపాలి. – ఎన్.నాంచారయ్య,
భక్తుడు, హైదరాబాద్
చర్యలు తీసుకుంటాం
శ్రీముఖలింగంలో ప్రధాన ఆలయం, గర్భగుడిలో పలు సమస్యలు గుర్తించాం. లోపలి భా గం అంతా అస్తవ్యవస్తంగా ఉంది. ఇటీవలే కేంద్రపురావస్తు శాఖ ఇంజినీరుతో పరిశీలించి నివేదిక సిద్ధంచేశాం. – మూర్తి,కన్జర్వేటివ్ అసిస్టెంట్, కేంద్ర పురావస్తు శాఖ, విశాఖపట్నం


