కామన్ మరుగుదొడ్లు..
● మరో పది మంది విద్యార్థినులకు డయేరియా లక్షణాలు ● కేజీబీవీలోనే నేలపై వైద్యం అందిస్తున్న వైనం
గార:
శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డయేరియా అదుపులోకి రావడం లేదు. శనివారం మరో పది మందికి విరేచనాలు కావడంతో వారందరికీ చికిత్స అందిస్తున్నారు. పాఠశాలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి పలు చర్యలు చేపడుతున్నా ఇంకా డయేరియా లక్షణాలతో విద్యార్థినులు ఇబ్బందు లు పడుతుండటం, కొత్త కేసులు నమోదవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోనే గార మండలం ఉన్నా మెరుగైన వైద్య చికిత్స ఎందుకు అందించడం లేదో సమగ్ర శిక్ష అధికారులే చెప్పాలి.
ఆదివారం మధ్యాహ్నం పెట్టిన చికెన్‌ను పూర్తి స్థాయిలో అందించకుండా కొంత ఉంచేసి మళ్లీ రాత్రి కూడా విద్యార్థినులకు వడ్డించడంతో మొదలైన సమస్య, సోమ, మంగళ, బుధవారాల్లో పప్పు పూర్తిస్థాయిలో ఉడకకపోవడం, నాణ్యత లేని వంటలతో ఇబ్బందిని ఫుడ్ రికార్డులో కొందరు విద్యార్థినులతో పాటు సిబ్బంది నమోదు చేశారు. రాగి అంబలిలో పురుగులు కనిపించడంతో సమస్యను వెంటనే విద్యార్థినులు చెప్పడంతో వాటిని పారబోశామని విద్యార్థులే అధికారులకు చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం, డయేరియా ప్రబలిన తర్వా త ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో పాటు అకౌంటెంట్, కుక్, ఏఎన్‌ఎంలను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. డీఈఓ రవిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ, సీఎంఓ, జీసీడీఓ, వైద్య శాఖ ప్రోగ్రాం అధికారులు కేజీబీవీని సందర్శించి, పలు సూచనలు చేసినా డయేరియా అదుపులోకి రాలేదు.
గార కేజీబీవీలో ఏపీసీ సుదీర్ఘ విచారణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు గార కేజీబీవీలో సుదీర్ఘ విచారణ చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు కేజీబీవీ చేరుకున్న ఆయన రాత్రి 7.30 గంటల తర్వాత కూడా అక్కడే ఉండి విద్యార్థులను సిబ్బందిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏఎన్‌ఎంను సస్పెండ్ చేసిన దృష్ట్యా వీలైన పక్షంలో రోజుకొకరు చొప్పున కేజీబీవీలో ఏఎన్‌ఎంలకు డ్యూటీ వేయాలని త్వరలోనే తాము వేరొకరిని నియమిస్తామని ఆయన చెప్పా రు. ఎస్‌ఓను సస్పెండ్ చేయడంతో ఆ బాధ్యతలను ఓసీఆర్‌టీకి అప్పగించారు. హెడ్ కుక్‌ను సస్పెండ్ చేయడంతో అటు తర్వాత ఉన్న కుక్‌ను బాధ్యతలు జాగ్రత్తగా చూడాలని వేరొక సహాయకురాలను తాత్కాలికంగా సమకూర్చుకోవాలని సూచించారు. ఏపీసీ చేపట్టిన విచారణలో అక్కడ సిబ్బంది ముఖ్యంగా ప్రిన్సిపాల్ వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి ఆయన దృష్టి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించి ఆ వివరాలను కూడా సేకరించినట్లు తెలియ వచ్చింది. వీటన్నింటి ఆధారంగా ఒకటి రెండు రోజుల్లో నివేదికని సిద్ధం చేసి జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులకు నివేదించనున్నారు. అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒకరిద్దరిపై విధుల నుంచి తొలగించే వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. జీసీడీఓ మాధవి శనివారం ఉదయమే గార కేజీబీవీకి చేరుకొని మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యవేక్షణ జరిపారు.
కేజీబీవీలో డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు 45 మంది వరకు వచ్చారు. పాఠశాలలో ఉన్న 270 మంది విద్యార్థినులకు, బాధిత విద్యార్థినులకు కామన్ మరుగుదొడ్లే వాడటం ఇబ్బందిగా మారింది. మరుగుదొడ్ల పరిశుభ్ర త విషయంలో ఇంకా గట్టి చర్యలు తీసుకోవ డం లేదని సమాచారం. డయేరియా బయటపడిన తర్వాత మరుగుదొడ్లలో వాడాల్సిన కెమికల్స్‌ను తెప్పించారని, అప్పటివర కు కొద్ది రోజులుగా బాత్‌రూమ్ క్లీనింగ్ మెటీరియల్ లేదని తెలుస్తోంది. ఇక స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం మధ్యాహ్నం పాఠశాలకు వచ్చిన సమయంలో నేలపైనే చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు.


