● అధ్వానంగా పోస్టుమార్టం గది
● పట్టించుకోని అధికారులు
నరసన్నపేట: పందులు.. పంది కొక్కులు.. చెత్తాచెదారం..మురుగునీరు.. ఇదంతా చూసి ఇదేదో డంపింగ్ యార్డు అనుకునేరు. ఇది అచ్చంగా నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలోని ఓ గది వద్ద పరిస్థితి. ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. గదిలో మృత దేహాలు ఉంచేందుకు ఎలాంటి సదుపాయాలు లేవు. దీనికి తోడు గది శ్లాబ్ పెచ్చులూడుతోంది. పిచ్చి మొక్కలు, మురుగు నీరు గది చుట్టూ ఉండటంతో దుర్వాసన వస్తోంది. పోస్టుమార్టం చేసేందుకు వస్తున్న వైద్యులు, సిబ్బంది నరకం చూస్తున్నారు. ప్రక్రియ అయ్యాక చేతులు కడుగుదామంటే నీరు కూడా ఉండని దుస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
నిరుపయోగంగా ఫ్రీజర్..
ఆస్పత్రికి వచ్చే మృతదేహాలు భద్రపరిచేందుకు ఇటీవల ప్రభుత్వం ఫ్రీజర్ మంజూరు చేసింది. రెండు మృత దేహాలు ఇందులో ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పీఎం షెడ్ దాన్ని పెట్టేందుకు అనువుగా లేకపోవడంతో ఆక్సిజన్ ప్లాంట్ గదిలో పెట్టారు. దీంతో ఫ్రీజర్లు నిరుపయోగమయ్యాయి.
నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి వెళ్తే సిగ్గేస్తోంది. కనీస సదుపాయాల్లేవు. చుట్టూ మురుగు నీరు ఉంది. పందులు, పందికొక్కులు తిరుగుతున్నాయి. పోస్టుమార్టం షెడ్ ఇలానే ఉంటుందా. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– వై.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు


