● విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందని పుస్తకాలు ● మరోవైపు కిట్లు అందక ఇబ్బందులు ● తల్లికి వందనం కోసం ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

● విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందని పుస్తకాలు ● మరోవైపు కిట్లు అందక ఇబ్బందులు ● తల్లికి వందనం కోసం ఎదురుచూపులు

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

● విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందని పుస్తకాలు ● మరోవైపు కిట్లు అందక ఇబ్బందులు ● తల్లికి వందనం కోసం ఎదురుచూపులు

కిట్లు సరఫరాలో జాప్యం

శ్రీకాకుళం:

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరుచుకునే రోజునే పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం, బూట్లు, బెల్టులు, డిక్షనరీతో కూడిన బ్యాగును కిట్టు రూపంలో అందజేసేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం గతేడాది నుంచి కిట్ల పంపిణీలో జాప్యం చేస్తూ వస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకొని ఇప్పటికే 20 రోజులు పైబడినా పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందకపోవడం వల్ల బోధనకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాకు 6,97,678 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా.. 6,81,909 పాఠ్య పుస్తకాలు చేరాయి. అయితే ఈ పాఠ్య పుస్తకాలు తక్కువ విద్యార్థుల ఉన్నచోటికి ఎక్కువ, ఎక్కువ విద్యార్థులు ఉన్నచోటకి తక్కువ సరఫరా కావడంతో కొంతమేర ఇబ్బంది పడుతున్నామని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఉపాధ్యాయ వర్గాలు మాత్రం పాఠ్య పుస్తకాలు అంతగా సరఫరా కాలేదని అంటున్నారు. పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడం వల్ల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం బోధనకు కష్టపడాల్సి వస్తోంది. ఇక బూట్లు, బెల్టులు, సాక్సులు, బ్యాగుల జాడే లేకుండా పోయాయి. మరోవైపు యూనిఫాంలు 1,52,135 అవసరమని ప్రతిపాదనలు పంపగా, ఇప్పటివరకు 55,625 మాత్రమే జిల్లాకు చేరాయి. వీటిని 12 మండలాలకు పంపించారు. మిగిలినవి ఈ నెలాఖరకు వస్తాయని చెబుతున్నారు. అయితే ఇవి కూడా విద్యార్థులకు చాలినంతగా సరఫరా అయ్యే పరిస్థితి లేదని విద్యాశాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిఏటా గతేడాది విద్యార్థుల సంఖ్యలో పదిశాతం కోత పెట్టి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు సరఫరా చేస్తున్నాయని, ఈ ఏడాది కూడా ఇలాగే సరఫరా కావడం వల్ల పాఠ్య పుస్తకాల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. యూనిఫామ్‌లు కూడా కోతపెట్టే పంపిస్తారని చెబుతున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే 7,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని.. ప్రభుత్వం 12 వేల వరకు కోతవిధించిందని వారు అంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు విశేష కృషి జరపడంతో ప్రభుత్వం భావించిన స్థాయిలో విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. కానీ ప్రభుత్వం మాత్రం కిట్ల సరఫరాలో కోతలు విధించి పంపిస్తోందని, దీనివల్ల అందరు విద్యార్థులకు కిట్లను అందజేయలేక తీవ్ర విమర్శలు తాము ఎదుర్కోవాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కిట్ల పంపిణీతో పాటు తల్లికి వందనం నిధులు కూడా ఇప్పటికీ జమ చేయకపోవడంతో మెగా పేరెంట్స్‌ డే ను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోగా మెగా పేరెంట్స్‌ డేను నిర్వహించాల్సి ఉంది. అయితే నేటికీ మెగా పేరెంట్స్‌ డే నిర్వహించిన పాపాన పోవడం లేదు. కిట్లు సరఫరాల జాప్యం, తల్లికి వందనం నిధులు జమ చేయకపోవడమే వాయిదాకు గల కారణాలని ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే కిట్లను పూర్తిస్థాయిలో సరఫరా చేయడంతో పాటు తల్లికి వందనం నిధులు జమ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement