పలాస: మండలంలోని కోసంగిపురం గ్రామ జగనన్న కాలనీకి చెందిన నెయ్యిల రాజేష్‌ను కొట్లాట కేసులో ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. పురుషోత్తపురం గ్రామానికి చెందిన తోట హేమరాజుకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం ఉంది. ఆ స్థలంలో ఆయన ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఇతను నిర్మిస్తున్న ఇంటి పక్కనే నెయ్యిల రాజేష్ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాడు. తోట హేమరాజు తాను ఇల్లు కట్టుకున్న ఇంటి వద్దనుంచి జగనన్న కాలనీ మెయిన్ రోడ్డు గుండా కొండవైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో నెయ్యిల రాజేష్ వెనుక నుంచి వచ్చి అతనిపై దాడి చేశాడు. తలపై బలంగా సుత్తితో కొట్టాడు. దీంతో అతడు గాయపడ్డాడు. హేమరాజు తమ్ముడు సురేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్లు వెల్లడించారు.


