పీఠంపై ‘పీఏ’ల కన్ను | - | Sakshi
Sakshi News home page

పీఠంపై ‘పీఏ’ల కన్ను

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

చిలమత్తూరు: మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం ‘పీఠం’ కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికే మున్సిపల్‌ చైర్మన్‌ సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తుండటంతో తమ అనుచరులను పోటీకి సిద్ధం చేస్తున్నారు.

పీఏలదే రాజ్యం.. నిధులన్నీ భోజ్యం..

ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉంటూ హైదరాబాద్‌కే పరిమితం కాగా, హిందూపురంలో ఆయన నియమించుకున్న పీఏలు శ్రీనివాసరావు, సురేంద్ర, బాలాజీ, వీరయ్య ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. ‘‘నలుగురు పీఏలు... నాలుగు దిక్కులు’’ అన్నట్లు ఇప్పటికే నియోజకవర్గాన్ని పంచుకుని మరీ దందాలు చేస్తున్నారు. భూకబ్జాలు, ఇసుక, మట్టి అక్రమ రవాణా, మద్యం సరఫరాతో పాటు సామాన్యులపై దాడులతో ఇప్పటికే వార్తల్లో నిలిచారు. తాజాగా మున్సిపల్‌ చైర్మన్‌ పోస్టుపైనే కన్నేశారు. 1.31 లక్షల ఓటర్లున్న హిందూపురంలో ఎమ్మెల్యే తర్వాత పెత్తనం చైర్మన్‌దే ఉంటుంది. దీంతో చైర్మన్‌ పీఠానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే మున్సిపల్‌ చైర్మన్‌ సీటు కోసం ఎమ్మెల్యే పీఏలు తమ అనుచరులను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే అనుచరులకే సీటు దక్కేలా ఎవరికి వారు లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్ల కోసం ఎదురుచూపు..

మున్సిపాలిటీలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉండగా, చైర్మన్‌ సీటు ఎవరికి వస్తుందా... అన్న ఉత్కంఠ ప్రధాన పార్టీల్లో నెలకొంది. అయితే అధికార కూటమి నేతల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటం, అక్రమాల సొమ్ము దండిగానే పోగేసుకున్న నేతలు సైతం మున్సిపల్‌ బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నలుగురు పీఏలతోనూ ఇప్పటికే ఎవరికి వారు మంత్రాంగం నడుపుతున్నారు. ఖర్చుకు వెనకాడని కొందరు నేతలు బేరసారాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే పోటీదారులు సైతం రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బీసీలకు కేటాయిస్తున్నారనే ప్రచారం జోరందుకోగా, అధికార టీడీపీలోని బీసీ నేతలంతా ఎమ్మెల్యే పీఏల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘పురం’లో భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్న ఓ నేత పేరు ప్రచారంలో ఉండగా, మద్యం వ్యాపారి సైతం చైర్మన్‌ సీటు కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

బరిలో జనసేన..?

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ గెలుపుకోసం పనిచేసిన తమకు కనీసం మున్సిపల్‌ చైర్మన్‌ సీటు అయినా దక్కుతుందని ఆశించిన బీజేపీ, జనసేన పార్టీలకు భంగపాటు తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ ద్వారా మున్సిపల్‌ చైర్మన్‌ సీటు టీడీపీకే కేటాయించేలా పీఏలు మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు ఇటీవలే సమావేశమై ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీలోనూ ఆశావహులు భారీగా ఉండగా, కూటమి అభ్యర్థిగా అవకాశం వస్తే మాత్రమే పోటీలో దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం..?

రెండున్నరేళ్ల పాలనలో చెడ్డపేరు తెచ్చుకున్న టీడీపీ.. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీతో ఢీకొట్టాలంటే ఎమ్మెల్యే బాలకృష్ణతో ప్రచారం తప్పనిసరి అని భావిస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే బాలకృష్ణతోనే వార్డుల్లో ప్రచారం చేయించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ పాల్గొన్న నేపథ్యంలో... ప్రస్తుత గడ్డు పరిస్థితుల వేళ ఆయన ప్రచారానికి రాక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరిట నేతలు చేస్తున్న దోపిడీపై ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండగా, వాటి ప్రభావాన్ని కాస్తయినా తగ్గించేందుకు నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తారనే చర్చ నడుస్తోంది.

‘పురం’ చైర్మన్‌ బరిలో

అనుచరులను నిలిపేందుకు

సిద్ధమైన ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు

రిజర్వేషన్‌ ఏదొచ్చినా పోటీలో

నిలిచేలా అభ్యర్థులను

సిద్ధం చేసుకుంటున్న వైనం

మున్సిపల్‌ చైర్మన్‌ సీటు తమకే

కేటాయించాలంటున్న జనసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement