సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

సోమందేపల్లి(పరిగి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరం వ్యక్తం చేశారంటూ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో వచ్చిన కథనం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ డిమాండ్‌ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తాను చేసిన తప్పును తెలుసుకుని వెంటనే అప్రూవర్‌గా మారి అసలేం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. శుక్రవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. సీఈసీ పనితీరు సరిగాలేదని ఆయనకున్న ఇద్దరు సబార్డినేట్‌లే చెబుతున్నారంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కమిషన్‌ అంటే ఓ నమ్మకమైన వ్యవస్థగా ప్రజలు పరిగణిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలతో ఆ నమ్మకం పోతోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎం ట్యాంపరింగ్‌ జరిగిందని ఇప్పటికే జనమంతా నమ్ముతున్నారని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు పరిశీలిస్తే అదంతా నిజమేనని నమ్మాల్సి వస్తోందన్నారు. ఓటు సవరణ అంశం కిందిస్థాయి అధికారులు చూసుకుంటారని, అయినప్పటికీ ఏకంగా సీఈసీ తన చేతుల్లోకి తీసుకోవడం చూస్తే ఆరోపణలన్నీ నిజమని తేలుతోందన్నారు.

గత ఎన్నికలన్నీ రద్దు చేయాలి..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌

అప్రూవర్‌గా మారి ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలి

జ్ఞానేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలన్నీ రద్దు చేసి రీఎలక్షన్‌ జరపాలి

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో 2024 నుంచి 2026 వరకూ జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటూ మిగిలిన ఎన్నికలన్నింటినీ రద్దు చేసి, రీఎలక్షన్‌ను జరపాలని ఉషశ్రీచరణ్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా మోసపూరిత ఎన్నికలు జరిగాయని వివిధ పార్టీల నేతలు చెప్పడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా జరగలేదని, తమ పార్టీ అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. క్రిమినల్‌ పనులకు దిగిన జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే అప్రూవర్‌గా మారాలన్నారు. ఆయన హస్తంతోనే ఏపీలో ఓట్ల గల్లంతు, ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందన్నారు. వీటన్నిటికీ ఆయనపై వచ్చిన ఆరోపణలనే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు గత ఎన్నికల్లో చేసిన తప్పులను వివరించాలన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వారిపై కచ్చితంగా చట్టపరంగా చర్యలుంటాయన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement