పుట్టపర్తి అర్బన్/ధర్మవరం అర్బన్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాలో 97.11 శాతం మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం తెలిపారు. జిల్లాలోని 5,366 పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు 3,66,044 మంది ఉండగా, 3,55,457 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈరోజు మాత్రలు తీసుకోని వారికి అక్టోబర్ 5వ తేదీ పంపిణీ చేస్తామన్నారు.
మాత్రలు పంపిణీ చేసిన మంత్రి..
ధర్మవరం పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. అనంతరం విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 552 మంది విద్యార్థినులున్నారని, మరుగుదొడ్ల సంఖ్య పెంచాలని విద్యార్థిని సాహితి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన మంత్రి మరుగుదొడ్ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సంస్కృతి సేవా సమితి సహకారంతో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలకు 4 ఏసీలు, విద్యార్థినులకు 35 సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు.


